
కరీంనగర్ లో భూ వివాదాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు కొత్తగా వచ్చిన సీపీ అభిషేక్ మహంతి. సమస్యల పరిశీలనకు సిట్ ను నియమించారు. ఇందులో భాగంగా నగరంలోని భూ వివాదాల్లో తలదూర్చుతున్న ఓ కార్పోరేటర్ తోపాటు, టీఆర్ఎస్ నేతను, మరో వ్యక్తిని ఇవాళ కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చశారు. రేకుర్తి, సీతారాంపూర్ కు చెందిన మరో ఇద్దరు ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ భగత్ నగర్ లోని కొత్త రాజిరెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమి విషయంలో జోక్యం చేసుకుని అతన్ని ఇల్లు కట్టుకోనీయకుండా రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ తోట రాములు, చీటీ రామారావు, నిమ్మశెట్టి శ్యాం అనే ముగ్గురిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ కు తరలించనున్నారు. చీటి రామారావుతో పాటు అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని తనను ఇబ్బందులు పెడుతున్నారని చాలా కాలంగా కొత్త రాజిరెడ్డి ఆరోపిస్తున్నారు.
టీఎస్ బీపాస్ ద్వారా అనుమతి వచ్చినా.. ఇంతకాలం అధికార బలంతో తనను ఇబ్బందుల పాలు చేసారంటూ.. హైదరాబాద్ లో ప్రజాపాలనకు హాజరై సీఎం రేవంతర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుంచి పోలీసులకు వచ్చిన ఆదేశాలతో విచారణ జరపిన సిట్ బృందం ఈ రోజు చర్యలు తీసుకుంది.