మహిళలు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి : బీఆర్ఎస్ డిమాండ్

మహిళలు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి :  బీఆర్ఎస్ డిమాండ్
  • మహిళలు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి
  • 33 శాతం చొప్పున కల్పిస్తూ పార్లమెంట్​ ప్రత్యేక సెషన్‌‌లోనే బిల్లులు పెట్టాలి

హైదరాబాద్, వెలుగు : చట్టసభల్లో మహిళలు, బీసీలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈనెల 18 నుంచి నిర్వహించే పార్లమెంట్​ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని స్పష్టం చేసింది. శుక్రవారం ప్రగతి భవన్‌‌లో  కేసీఆర్​ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్​పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

మహిళా, ఓబీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు కేసీఆర్​సూచించారు. మహిళల సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్​కట్టుబడి ఉందని, దేశవ్యాప్తంగా వారి హక్కులు కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎంపీలు లోక్​సభ, రాజ్యసభల్లో ఈ రెండు బిల్లుల కోసం గళమెత్తాలని సూచించారు.

వివక్ష పోవాలంటే రిజర్వేషన్లు కల్పించాలి

మహిళలు, బీసీలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లులు ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. మహిళలు సమాజంలో సగభాగమని, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా వాళ్లు రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని లేఖలో పేర్కొన్నారు. మహిళల్లో దాగి ఉన్న శక్తిని వెలికితీసి, వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేసినప్పుడే ఏ సమాజమైనా ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. రాజకీయ అధికారంలోనూ మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మహిళా బిల్లు తీసుకురావాలని కోరారు.

ALSO READ: మావోయిస్టు దీపక్ రావు అరెస్టు

చట్టసభల్లో మహిళలకు 33% కోటా ఇవ్వాలని కోరుతూ తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో 2014 జూన్​14న ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, దానిపై కేంద్రం ఇంతవరకు స్పందించలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలు, మహిళలకు అధికారికంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నదని తెలిపారు. సమాజంలో మహిళలపై వివక్ష పోవాలంటే 33% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. దేశ సంపద సృష్టిలో కీలకంగా వ్యవహరిస్తున్న సబ్బండ వర్గాలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందని వివరించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటున్న ఓబీసీ కులాలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ బిల్లును పార్లమెంట్​ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ 2014 జూన్​15న తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. ఈ సెషన్​లోనే బీసీ కోటా బిల్లు ప్రవేశపెట్టి వారి అభివృద్ధిపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

జమిలిపై కేంద్రానికే చిత్తశుద్ధి లేదు: రంజిత్​రెడ్డి

జమిలి ఎన్నికలపై కేంద్రానికే చిత్తశుద్ధి లేదని చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి అన్నారు. పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత ప్రగతి భవన్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో జమిలి ఎన్నికలు పెట్టాలని తమ పార్టీ గతంలోనే ప్రతిపాదించిందని, దీనిపై వెనక్కి వెళ్లబోమన్నారు. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే దేశం పేరు మార్పు అంటూ మోదీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇంత ఆదరాబాదరాగా కేంద్రం పార్లమెంట్​సమావేశాలు సెషన్ ​పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈడీ నోటీసులకు కవిత భయపడబోరని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​నేత అన్నారు.

రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే నోటీసులు

రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తన కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ ​పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ ​వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రాబోయే రోజుల్లో మరికొందరికి ఇలాంటి నోటీసులు రావొచ్చని, అలర్ట్‌‌గా ఉండాలని చెప్పినట్టు సమాచారం. రాజకీయ వేధింపుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసే ప్రయత్నాలను రాజకీయంగానే ఎదుర్కొందామని, అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పినట్టు తెలిసింది. 75 ఏళ్ల పార్లమెంట్​ప్రస్థానంపై చర్చించే పేరుతోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా కేంద్రం చెప్తున్నదని, ఈ నెల 17న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో అదనంగా ఇంకా ఏదైనా ఎజెండాను తీసుకువస్తే వాటిపై ఎలా ముందుకెళ్లాలో ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తామని కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం. కేంద్రం చెప్పాపెట్టకుండా జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, యూనిఫాం సివిల్ కోడ్ లాంటి బిల్లులు తెచ్చే అవకాశం లేకపోలేదని.. వాటిని పార్లమెంట్​ముందుకు తెస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై తానే స్వయంగా సూచనలు చేస్తానని అన్నారు. చట్ట సభల్లో మహిళలు, బీసీలకు 33 శాతం కోటా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే ధ్యేయంగా ఎంపీలు పని చేయాలని సూచించారు.
-