
నెట్వర్క్, వెలుగు: రైతులు పంట పొలాల్లో నిర్మించుకున్న కల్లాల కోసం ఖర్చు చేసిన రూ.151 కోట్లు వాపస్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాయి. కేంద్రం తీరుకు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాల్లో ఇంద్రకరణ్ రెడ్డి మినహా మంత్రులెవరూ పాల్గొనలేదు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని లక్షన్నర మంది రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మిగతా మంత్రులు అధికారిక కార్యక్రమాలు, రివ్యూలు, ప్రీ క్రిస్మస్ వేడుకలు, ఇతర ఉత్సవాలకే పరిమితమయ్యారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా చేపట్టిన ఈ ధర్నాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ ల చైర్మన్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన ధర్నాకు ఆ జిల్లా ఎమ్మెల్యేలెవరూ హాజరుకాలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ధర్నా కొనసాగించారు.
రైతులను కేంద్రం దగా చేస్తున్నది: ఇంద్రకరణ్ రెడ్డి
రైతులను కేంద్ర ప్రభుత్వం దగా చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీ కింద నిర్మించిన కల్లాలకు నిధులు ఇవ్వకుండా మోకాలడ్డుతోందని మండిపడ్డారు. నిర్మల్ కలెక్టరేట్ఎదుట నిర్వహించిన ఆందోళనలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతోందని ఫైర్ అయ్యారు.