మణుగూరు, వెలుగు : తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తుందని, జిల్లాలోని ఇద్దరు మంత్రులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా.. యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా..? అంటూ మండిపడ్డారు. సోమవారం మణుగూరులోని హనుమాన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడారు.
నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెనింగ్ నిర్వహిస్తే తట్టుకోలేని ఎమ్మెల్యే తన కార్యకర్తలతో ఆఫీస్ పై దాడి చేయించడం పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తమదంటూ చెబుతున్న కాంగ్రెస్ నాయకులు తమ వద్ద ఆధారాలుంటే చూపించాలన్నారు. వారు ట్రైలర్ మాత్రమే చూపించారని, తను సినిమా చూపిస్తానన్నారు. డీఎంఎఫ్టీ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ పోశం నరసింహారావు, నాయకులు కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, లక్ష్మణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
