
హైదరాబాద్, వెలుగు: ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్కుట్రలు చేస్తోందంటూ.. దాన్ని రైతులకు వివరించేందుకు పది రోజుల పాటు రైతు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ కేడర్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ వద్దు మూడు గంటలు చాలు అంటున్నారని, ఈ కామెంట్లపై రైతులు స్పందించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పార్టీకి మద్దతిస్తే ఉచిత కరెంట్రద్దు అవుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు సోమవారం నుంచి పది రోజుల పాటు రైతు వేదికల వద్ద సమావేశాలు నిర్వహించాలన్నారు.
కనీసం వెయ్యి మంది రైతులకు తగ్గకుండా సమావేశంలో పాల్గొనేలా చూసుకోవాలన్నారు. ఈ బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆదేశించారు. 24 గంటల ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయా సమావేశాల్లో తీర్మానాలు చేయాలన్నారు. రాష్ట్రంలోని 95 శాతం మంది రైతులకు మూడు గంటల కరెంట్‌చాలు అన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మూడు పంటల బీఆర్ఎస్ కావాలా.. మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ కావాలా అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
రైతులు, వ్యవసాయంపై గుడ్డి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్అవసరం లేదని మాట్లాడుతోందన్నారు. 2001లో అప్పటి సీఎం చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని, ఆయన శిష్యుడైన ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత కరెంట్వద్దంటున్నారని అన్నారు.