బీజేపీ, కాంగ్రెస్ లీడర్లపై బీఆర్ఎస్ ఫోకస్

బీజేపీ, కాంగ్రెస్ లీడర్లపై  బీఆర్ఎస్ ఫోకస్
  • రంగంలోకి కేసీఆర్.. ఉమ్మడి మెదక్ నేతలకు ఆహ్వానం
  • ఎన్నికల్లో టికెట్లు.. లేదంటే పదవులు ఇస్తామని హామీలు 
  • ఉత్తర తెలంగాణ జిల్లాల లీడర్లతో కేటీఆర్ చర్చలు 
  • దక్షిణ తెలంగాణ జిల్లాల నేతలతో హరీశ్ సంప్రదింపులు

హైదరాబాద్, వెలుగు : బీజేపీ, కాంగ్రెస్ లీడర్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలే టార్గెట్​గా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి బండి సంజయ్​ని తప్పించడం, కొత్తగా కిషన్ రెడ్డిని నియమించడంతో ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొంతమంది సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇదే అవకాశంగా ఆ రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలతో బీఆర్ఎస్ టచ్​లోకి వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలే ఉండడంతో.. ఆ పార్టీల్లోని ముఖ్య నేతలను కారెక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. 

ఇందుకోసం ఏకంగా బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. రెండు ప్రధాన ప్రతిపక్షాలను దెబ్బతీసి, ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొందరు లీడర్లతో సంప్రదింపులు జరిపారు. పార్టీలోకి వస్తే టికెట్​ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఉత్తర తెలంగాణ నేతలను బుజ్జగించి కారెక్కించే బాధ్యతను మంత్రి కేటీఆర్​కు.. దక్షిణ తెలంగాణ లీడర్లతో మాట్లాడి గులాబీ కండువా కప్పించే టాస్క్ ను మంత్రి హరీశ్​రావుకు అప్పగించారు. 

మారిన పొలిటికల్ సీన్.. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్ సభ​ఎన్నికల నాటికి దారుణంగా దెబ్బతిన్నది. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మళ్లీ పుంజుకుని విజయం సాధించింది. కానీ దుబ్బాక బైపోల్​తో రాష్ట్రంలో పొలిటికల్​ సీన్​ మారిపోయింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ను ఢీకొట్టబోయేది తామేఅన్నట్టుగా బీజేపీ పుంజుకుంది. 
 

అయితే ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ఘన విజయం సాధించడంతో..  మన రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. కొత్త చేరికలతో కాంగ్రెస్​లో జోష్ కనిపిస్తుండగా, అధ్యక్ష బాధ్యతల నుంచి సంజయ్​ని తప్పించడంతో బీజేపీలో కొంత నైరాశ్యం నెలకొంది. అయితే కాంగ్రెస్​లో కొత్త ఉత్సాహానికి తానే కారణమన్నట్టుగా రేవంత్ ప్రమోట్ చేసుకోవడం పార్టీ సీనియర్లకు కోపం తెప్పిస్తున్నది. పార్టీ కోసం తాము ఎంత పని చేసినా, ఆ క్రెడిట్ మాత్రం రేవంత్​కే దక్కుతున్నదని వాళ్లంతా అసంతృప్తిలో ఉన్నారు. 

మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి జోష్​ తెచ్చిన బండి సంజయ్​ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ లీడర్లలో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాలతో రెండు పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలే టార్గెట్​గా గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్​ప్రారంభించింది. కనీసం 10 నుంచి 15 మంది ముఖ్య నేతలను కారెక్కించడమే ధ్యేయంగా ప్రగతి భవన్​ నుంచి ఆపరేషన్ మొదలుపెట్టింది.  

ఉత్తరాన కేటీఆర్.. దక్షిణాన హరీశ్ 

ఉత్తర తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్​ అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్​ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారని ప్రగతి భవన్​వర్గాలు చెబుతున్నాయి. ఓ మాజీ మంత్రి కుటుంబ సభ్యులతో కేటీఆర్ పలుమార్లు సమావేశమయ్యారు. పార్టీలోకి వస్తే టికెట్​ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ ​జిల్లాల నేతలపై కేటీఆర్​ ప్రధానంగా దృష్టి సారించారు. వరంగల్​లోనూ కొందరు నేతలతో ఆయన మాట్లాడినట్టుగా సమాచారం. ఎలాగైనా బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడమే టార్గెట్​గా కేటీఆర్ పలు ప్రాంతాల్లో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

ఇదే టైమ్​లో దక్షిణ తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ అసంతృప్త నేతలపై హరీశ్​రావు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలువురు నేతలను ఆయన నేరుగా కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. ‘రేవంత్ కోసం ఎందుకు కష్టపడతారు. అలా చేస్తే వచ్చే ప్రయోజనం ఏముంది?’  అని కాంగ్రెస్ నేతలతో అన్నట్టు తెలిసింది. తమ పార్టీలోకి వస్తే ఎన్నికల్లో టికెట్లు లేదంటే ఏదో ఒక పదవి ఇస్తామని హరీశ్ రావు హామీలు ఇస్తున్నారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకుంటే రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని చెబుతున్నారు.

ముగ్గురికి కేసీఆర్ ఆఫర్.. 

ఉమ్మడి మెదక్​ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రితో కేసీఆర్ ఫోన్​లో మాట్లాడినట్టు తెలిసింది. జిల్లాలోని ఒక రిజర్వుడు సీటు నుంచి సదరు మాజీ మంత్రి లేదా వారి కుటుంబంలో ఒకరికి టికెట్​ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వీలు చూసుకొని ఒకసారి కలుద్దామని కూడా చెప్పారు. ఇదే జిల్లాలో రెడ్డి కులానికి చెందిన మరో లీడర్​తోనూ కేసీఆర్​ మాట్లాడారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో బీఆర్ఎస్​కు బలమైన అభ్యర్థి లేకపోవ డంతో తమ పార్టీలోకి వస్తే టికెట్​ ఇస్తామని మాటిచ్చారు. ఇదే జిల్లాకు చెందిన ఇంకో లీడర్​తోనూ  కేసీఆర్​ సంప్రదింపులు జరుపుతు న్నారు.

కేసీఆర్ ఇచ్చిన భరోసాతోనే సదరు లీడర్ సొంత పార్టీ నాయకులపై హాట్​ కామెంట్స్​చేసినట్టు గులాబీ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఈ ముగ్గురు లీడర్లు కొన్ని రోజుల్లోనే గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని చెబుతున్నారు. తనతో గతంలో సన్నిహితంగా పనిచేసి ఇతర పార్టీల్లో ఉన్న ఒకరిద్దరు నేతలతోనూ కేసీఆర్​ మాట్లాడినట్టుగా సమాచారం. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది.