కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభం కంటే నష్టమే ఎక్కువ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభం కంటే నష్టమే ఎక్కువ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సిద్దిపేట రూరల్, వెలుగు: తాము ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, బడుగు బలహీన వర్గాల అభ్యన్నతికి కోసం వచ్చామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం సిద్దిపేటలో బహుజన ఘీంకార  సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభం కంటే నష్టమే అధికంగా ఉందని, అందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులే బాధ్యులన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

 నిరుద్యోగులు, విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. టీఎస్పీఎస్ సీలో ప్రశ్నపత్రాలను లీక్ చేసి ఒక్కో పరీక్ష పేపరును రూ.10లక్షలకు విక్రయించారని ఆరోపించారు.  మిషన్ కాకతీయ, భగీరథ నిర్మాణాల పేరుతో ప్రజా ధనాన్ని విచ్చల విడిగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సిద్దిపేటలో బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ ను చూస్తే మంత్రి హరీశ్ రావు భయపడుతున్నారన్నారు. బీఎస్పీ సభకు అనుమతి ఇవ్వడానికి అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తాము అధికారంలోకి వస్తే నిరంతరం ప్రజల్లోనే ఉంటామన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.