సమగ్ర వ్యవసాయ విధానం పట్టని ప్రభుత్వం

సమగ్ర వ్యవసాయ విధానం  పట్టని ప్రభుత్వం

తెలంగాణలో  వ్యవసాయమే ప్రధాన వృత్తి. 70 శాతం ప్రజలు నేటికీ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుతో తమ  భవిష్యత్తు అభివృద్ధి వైపు దూసుకు పోతుందని ప్రజలు ఆశించారు. అయితే, అధికారంలోకి  వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది ఏండ్లుగా సమగ్రమైన విధానం లేకుండా తాత్కాలిక నిర్ణయాలు చేస్తూ కాలం గడిపింది. దేశంలోనే ఎక్కడా  లేనివిధంగా రైతు బంధు పథకం,  రైతు బీమా పథకం ( రైతు చనిపోతే ఇచ్చే పథకం), వ్యవసాయానికి 24 గంటలు కరెంటు అందిస్తున్నామని సర్కారు చెబుతున్నది. 

అయితే, రైతుబంధు పేరుతో వ్యవసాయం చేయనివారికి, వ్యాపారం, పరిశ్రమ, ఎన్ఆర్ఐ, రియల్ ఎస్టేట్ చేసే రియల్టర్లకు వేల కోట్లు ఇస్తున్నారు. రైతులకు సంబంధించిన వ్యవస్థలను ప్రభుత్వం పూర్తిగా బలహీనపరిచింది. ప్రకృతి వైపరీత్యాలలో పంటలను కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వకపోగా, అసలు నష్టాన్ని అంచనా వేసే వ్యవస్థను కూడా మూలన పడేసింది. 

కౌలు రైతులు, రుణ విముక్తి నిర్వీర్యమా?

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది. రాజకీయ నాయకులు ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల సందర్భంలో ఇచ్చే సంక్షేమ పథకాల హామీలు నిజంగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తాయా? సంక్షోభంలో ఉన్న వ్యవసాయ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయా?  రైతుల ఆత్మహత్యలు, వలసలు ఆగిపోతాయా?  అని పరిశీలిస్తే లేదనే చెప్పాలి.  

భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిని ఇచ్చే పథకాన్ని కేసీఆర్​ ప్రభుత్వం అమలు చేయకుండా పక్కన పడేసింది. కౌలు రైతులను గుర్తించటానికి 2011లో ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన చట్టాన్ని, రాష్ట్రం ఏర్పడ్డాక 2015–-16లో ఒక్క సంవత్సరం మాత్రమే అమలు చేసి మానేసింది. వ్యవసాయ కుటుంబాలను రుణ విముక్తులను చేయడానికి ఉద్దేశించిన 2016 రుణ విముక్తి చట్టం స్ఫూర్తిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. 2013 భూ సేకరణ చట్టాన్ని మార్చేసి 2016 నుంచి పేద రైతుల భూములను గుంజుకుంటున్నది. కొత్తగా అశాస్త్రీయమైన రెవెన్యూ చట్టాన్ని తెచ్చి( ధరణి) మొత్తం రెవెన్యూ వ్యవస్థను నామరూపాలు లేకుండా చేసింది. అసైన్డ్ భూముల రైతులను ఇబ్బందుల పాలు, వక్స్ భూములను పూర్తిగా కబ్జాకోరుల పాల్జేసింది.  

మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలి

2014 నుంచి ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని రైతన్నలు కోరుకుంటున్నారు.  రైతులకు మళ్లీ వడ్డీ లేని రుణాలు లభించేలా చూడాలి. వ్యవసాయ రుణ విముక్తి కమిషన్ చట్టాన్ని మరింత పటిష్టం చేసేలా సవరణ తేవాలి.  ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జాతీయ విపత్తు చట్టం 2005 ప్రకారం క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పంటల బీమా పథకాన్ని, బీమా కంపెనీలకు లాభాలు కలిగించేలా కాక రైతులకు మేలు చేసే విధంగా రూపొందించి అమలు చేయాలి. 

రాష్ట్రస్థాయిలో మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలి. అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులు లెక్కలు వేసి కనీసం మద్దతు ధరలను ప్రకటించాలి. పంట ధరలను నిర్ణయించేందుకు కమిషన్ వేసి  దానికి చట్టబద్ధత కల్పించాలి. వరి ధాన్యం సేకరణకే పరిమితం కాకుండా.. పప్పు ధాన్యాలను, చిరుధాన్యాలను, నూనె గింజలను కూడా ప్రభుత్వం సేకరించాలి. కౌలు రైతులను గుర్తించేందుకు 2011 సాగుదారుల చట్టాన్ని అమలు చేసి, రాష్ట్రంలో 20 లక్షలకు పైగా(36 శాతం) ఉన్న కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు అందించాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని కూడా కౌలు రైతులతో సహా వాస్తవ సాగుదారులకు వర్తించేలా మార్పులు తీసుకురావాలి.

మండలానికి ఒక మార్కెట్​యార్డ్​

ప్రతి మండలానికి కనీసం ఒక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లను తగిన మౌలిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలి. పంట ఉత్పత్తులు తడిసిపోకుండా నిల్వ ఉండేలా తగినన్ని గోడౌన్లు ఏర్పాటు చేయాలి. నకిలీ విత్తనాలను అరికట్టడానికి, తక్కువ ధరలకు నాణ్యమైన విత్తనాలను అందించటానికి విత్తనోత్పత్తి చేసే రైతుల ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్రస్థాయిలో విత్తన చట్టాన్ని తీసుకురావాలి.  

గ్రామీణ ప్రాంతంలో పంటల సాగు, పశు పోషణ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి.  ప్రభుత్వ సహకార రంగాలలో చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలి. వ్యవసాయ అనుబంధ రంగ రుణాలు రూరల్ జిల్లాలకు ఎక్కువగా ఇవ్వాలి. రెవెన్యూ భూముల సమగ్ర సర్వే జరిపి భూ రికార్డులను పూర్తిగా సర్వే చేయాలి. సమగ్ర సర్వే ఆధారంగా ధరణి సమస్యలను తక్షణం పరిష్కరించాలి. 

పంటల బీమాలేని ఏకైక రాష్ట్రం తెలంగాణ

పంటల బీమా పథకం లేని ఏకైక రాష్ట్రం  తెలంగాణ. గతంలో  రైతులకు విత్తన కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై విత్తనాల సరఫరా, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పరికరాలు అందేవి.  స్ప్రింక్లర్లు, పవర్​ స్రేయర్స్, సోలార్ పనిముట్లు, ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లతోపాటు  అనేక పరికరాలను10 శాతం నుంచి 90 శాతం వరకు చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీపై అందేవి. ఈ సబ్సిడీలు అన్నింటిని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. 

పావలా వడ్డీనీ ఆపివేసింది. రుణమాఫీ హామీ సరిగా అమలు చేయకపోవడంతో రైతులపై మరింత వడ్డీ భారం పెరిగింది.  రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా బలహీనపరిచి, వీఆర్వో వ్యవస్థనే లేకుండా చేసింది. సమగ్ర భూ సర్వే జరపకుండా ధరణి వ్యవస్థ తేవడం వల్ల  భూ సమస్యలు మరింత జటిలమయ్యాయి. ప్రభుత్వ తప్పుడు వైఖరి వల్ల రాష్ట్రంలో రైతులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాకుండానే ఉన్నాయి.  దీని మూలంగా రాష్ట్రంలో గత తొమ్మిదేండ్లలో 7000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదు. 

- ఉజ్జిని రత్నాకర్ రావు,సీపీఐ సీనియర్​ నేత