హైదరాబాద్‌లో వర్షాలు పడుతుంటే రోడ్లు, డ్రైనేజీల పనులు

హైదరాబాద్‌లో వర్షాలు పడుతుంటే రోడ్లు, డ్రైనేజీల పనులు
  • ట్రాఫిక్​ జామ్​కు తోడు కొత్త తలనొప్పి  
  • బల్దియా, వాటర్ బోర్డు తీరుతో నగరవాసుల ఇబ్బందులు 
  • చాలా చోట్ల రోడ్లు బంద్ ​చేసి  పనుల కొనసాగింపు  
  • వానాకాలానికి ముందే పూర్తి చేయకుండా నిర్లక్ష్యం

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఓ వైపు వర్షాలు పడుతుంటే బల్దియా, వాటర్ బోర్డు అధికారులు రోడ్లు, డ్రైనేజీల పనులు చేస్తూ నగరవాసులను ఇబ్బందులు పెడుతున్నారు. సీసీ, బీటీ రోడ్ల రిపేర్లతో పాటు కొత్త రోడ్ల నిర్మాణ పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాల్సి ఉండగా బల్దియా నిర్లక్ష్యం వహించింది. వీటితో పాటు స్ర్టామ్ వాటర్​డ్రెయిన్ల పనులు కూడా ఇంకా కొనసాగిస్తున్నారు. పైగా, కొన్ని చోట్ల రోడ్లను బ్లాక్​చేసి మరీ వర్క్స్​చేస్తుండడంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు. అసలే వర్షాలకు ట్రాఫిక్​మెల్లి మెల్లిగా కదులుతుంటే ఈ పనులతో ఆయా పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి.

 దీనికంతటికీ జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. ఇంజినీరింగ్ విభాగానికి ఇటీవల చీఫ్ ఇంజినీర్ కొత్తగా రావడంతో పాటు జోనల్ లెవెల్​లో కో ఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందంటున్నారు. మరోవైపు వాటర్ బోర్డు కూడా బల్దియా నుంచి పర్మిషన్​తీసుకోకుండానే ఇష్టమున్నట్టు రోడ్లను తవ్వేస్తుండడంతో సమస్య మరింత పెద్దదవుతోంది.  

అహ్మద్​నగర్​లో ఇలా...

నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని అహ్మద్ నగర్ డివిజన్ లోని పోలీస్ మెస్ మెయిన్ రోడ్డు నిర్మాణ పనులను 20 రోజుల ముందే ప్రారంభించారు. ఇక్కడ కొత్త రోడ్డు వేసేందుకు డ్యామేజ్​అయిన పాత రోడ్డును తొలగిస్తున్నారు.  పోలీస్ మెస్ నుంచి రాక్ చర్చి మీదుగా అహ్మద్ నగర్ వెళ్లే రోడ్డును పూర్తిగా తవ్వి వదిలేయడమే కాకుండా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా వయా చాచా నెహ్రూపార్కు మీదుగా మాసాబ్ ట్యాంక్ వెళ్లే వాహనాలు ఫస్ట్ లాన్సర్ రోడ్డులో జామ్ అవుతున్నాయి. 

పైగా సరోజినీ దేవి కంటి దవాఖాన పక్కనే ఉన్న బస్టాప్​వద్ద బంజారాహిల్స్ వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డు అని పోలీసులు ఏర్పాటు చేసిన బోర్డు వాహనదారులకు మరిన్ని కష్టాలు తెచ్చి పెడుతోంది. తక్కువ ట్రాఫిక్ ఉండే రూట్ అంటూ ఏర్పాటు చేసిన బోర్డును నమ్ముకుని పంజాగుట్ట, బంజారాహిల్స్ వెళ్లే వాహనదారులు ఈ రూట్ లో వచ్చి ఓవైసీపురా క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. రాక్ చర్చి నుంచి పోలీస్ మెస్ వెళ్లే దారి తవ్వి వదిలేయడంతో వాహనదారులు ఓవైసీపురా, ఎంజీనగర్ మీదుగా గార్డెన్ టవర్ వరకు చేరుకుని అక్కడి నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్ , లక్డీకాపూల్ వైపు వెళుతున్నారు. 

మింట్ ​కంపౌండ్ ​టు బడా గణేశ్​ రూట్​

మింట్ కాంపౌండ్ నుంచి ఖైరతాబాద్​బడా గణేశ్ వైపు వెళ్లే రోడ్డును పూర్తిగా మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వాటర్ బోర్డు సీవరేజీ లైన్ పనుల కారణంగా పూర్తిగా రోడ్డుని తవ్వేశారు. ఇంకా ఇక్కడ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులు పూర్తయి తిరిగి రోడ్డు వేసేందుకు కనీసం 15 రోజులైనా పట్టే అవకాశం ఉంది. కానీ, వర్షాలు పడుతుండడంతో మరింత ఆలస్యమయ్యే చాన్స్ ఉంది. 

మాసబ్​ట్యాంక్​లోనూ.. 

మాసబ్​ట్యాంక్ లోని ఇన్​కమ్ ట్యాక్స్ ఆఫీసు రోడ్డులో స్ర్టామ్ వాటర్ డ్రెయిన్ పనులు మొదలుపెట్టిన అధికారులు ఇంకా పూర్తి చేయలేదు. మ్యాన్ హోల్ మూతలు పెట్టి వదిలేయడంతో అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి. వానలకు నీళ్లు నిలిస్తే గుంతలు కనిపించే పరిస్థితి లేదు. అలాగే, రాంనగర్ రాజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ఇందిరా పార్కు సమీపంలోని చిక్కడపల్లి వద్ద ఉన్న స్టీల్ బ్రిడ్జి కింద సీవరేజీ పనులంటూ రోడ్డు తవ్వి వదిలేశారు. టోలిచౌకి ఎండీ లైన్స్ నుంచి లంగర్ హౌస్ వెళ్లే రోడ్డులో 8 నెలలుగా పనులు కొనసాగుతున్నాయి. 

ఇక్కడే ప్యారామౌంట్ కాలనీలో జీహెచ్ఎంసీ సీసీ రోడ్డు పనులు చేస్తోంది. వర్షాలు కురుస్తుండడంతో రోడ్డు పనులు ఆగిపోయాయి. దీంతో వాహనదారులు టోలిచౌకీ కాలనీల్లోంచి వెళ్తున్నారు. కాలనీల్లో రోడ్డు చిన్నగా ఉండడంతో  ఇబ్బందులు తప్పడం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్​10లో కూడా రోడ్డును తవ్వి వదిలేయటంతో వాహనదారులు కష్టాలు పడుతున్నారు. లక్డీకాపూల్​ మెయిన్ ​రోడ్డు పక్కన డ్రైనేజీ పనులు చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ పనులు కూడా ఎప్పుడో చేయాల్సి ఉన్నా ఇంకా కొనసాగిస్తున్నారు. నగరంలోని చాలాచోట్ల ఇదే పరిస్థితి ఏర్పడింది.