
ఆధునిక సమాజంలో మానవ సమూహం అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. మానవ సంబంధాలు పూర్తిగా నిర్వీర్యం చెందుతున్నాయి. ఆస్తుల కోసమో, తెలిసి తెలియని వయసులో ప్రేమపేరుతో ఆకర్షణతోనో, తమ పంతం నెగ్గించుకోవాలనో ఏకంగా కన్నవారినే చంపడానికి కూడా ఏ మాత్రం వెనుకాడని ఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో మొదలైన పరిచయం ఆకర్షణగా మారి వాళ్లు చేసేదే సరైనది అనే కోణంలో ఆలోచిస్తూ తీవ్రమైన చర్యలకు పాల్పడుతోంది నేటి యువత. ప్రేమపేరుతో ఆకర్షణకులోనై అమాయకపు బాలికలు మోసపోవడం, లైంగిక దాడులకు గురవడం, చివరకు హత్యకు గురవడం వంటి ఘటనలు అనేకం చూశాం. తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి.
కానీ, నేడు తమ ప్రేమను అంగీకరించకపోతే ఏకంగా హత్యలు చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడకపోవడమనే ధోరణి నవీన సమాజపు మనుగడను ప్రశ్నిస్తోంది. నేటి సమాజంలో ఎందుకు యువత ఇటువంటి విపరీత ధోరణులకు పాల్పడుతున్నది, ఎందుకు చిన్న వయస్సులోనే నేర పూరిత స్వభావాన్ని అలవర్చుకుంటున్నది అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం.
గ్రామ పాఠశాలలకూ చేరుతున్న ‘మత్తు’
నేడు పిల్లల్లో గతంలో కంటే స్వేచ్ఛ పెరిగింది. కానీ, పర్యవేక్షణ లోపించింది. గతంలో పాఠశాల స్థాయి పిల్లల మీద కుటుంబ సభ్యుల ప్రభావం, బడిలో టీచర్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. అయితే నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్న కుటుంబాలుగా రూపాంతరం చెందిన తరువాత పిల్లల స్వేచ్ఛ మీద నియంత్రణ, పర్యవేక్షణ కరువైంది.
నేడు విద్యావ్యవస్థ కూడా యాంత్రికంగా మారిపోయింది. నిరంతరంగా కేవలం విద్యా సంబంధ, మార్కెట్ ఓరియెంటెడ్ అంశాలకే ప్రాధాన్యతనిస్తూ మానవీయ విలువలను పెంపొందించడాన్ని విస్మరిస్తున్నది. దీంతో విద్యార్థుల్లో సరైన మార్గ నిర్దేశం లేకుండా పోతున్న మాట వాస్తవం. “ప్రతి మనిషిలోనూ జంతు ప్రవృత్తి దాగి ఉంటుంది.
సామాజిక కట్టుబాట్లకు అనుగుణంగా అది అణచివేయబడుతుంది” అని సిగ్మండ్ ఫ్రాయిడ్ అభివర్ణించారు. ప్రపంచీకరణ తర్వాత దేశంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. పాశ్చాత్య సంస్కృతి మానవ సమూహాన్ని, ముఖ్యంగా కౌమార దశ, యవ్వన దశలో ఉన్నవారిని విపరీతంగా ఆకర్షించింది. పార్టీ, పబ్ కల్చర్, డ్రగ్స్ వినియోగం వంటివి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
పోలీస్ యంత్రాంగం ఎంతగా కష్టపడి కట్టడి చేయాలని చూసినా దొడ్డిదారిన మత్తుపదార్థాలు వినియోగిస్తూనే ఉన్నారు. అయితే ఒకప్పుడు నగరాల్లో ఉండే కళాశాలల వరకే పరిమితం అయిన వీటి వినియోగం నేడు గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల వరకు కూడా విస్తరించడం, పిల్లలు మత్తు వ్యసనానికి బానిసలుగా మారుతూ ఉండడం సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
కట్టడి చేసే చట్టాలు మరిన్ని రావాలి
పిల్లల్లో విపరీత ధోరణి పెరగడానికి సాంకేతిక మాద్యమాల వినియోగం కూడా ఒక ప్రధానమైన కారణం. సామాజీకీకరణ ప్రక్రియలో సామాజిక మాధ్యమాలు, మీడియా కూడా అత్యంత ప్రధానమైన కారకాలు. మానవుని ఆలోచనలను, మానసిక స్థితిగతులను ఇవి తీవ్రంగా ప్రభావితం చేయగలుగుతాయి. ఇటీవల పెరుగుతున్న సామాజిక మాధ్యమాల వినియోగం పిల్లల్లోనే ఎక్కువగా ఉంటున్నది.
అయితే సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్ సెన్సార్ పరిధిలోకి రాకపోవడంతో పిల్లలను చెడుమార్గం వైపు సులభంగా మరల్చేలా చేస్తుంది. దాన్ని కట్టడి చేసే చట్టాలు మరిన్ని రావాలి. పిల్లల్లో పెరుగుతున్న హింసాత్మక ధోరణులను, నేరపూరిత ఆలోచనలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నిరోధించగలుగాలి.
మత్తు పదార్థాలకు, సామాజిక మాధ్యమాలకు బానిస కాకుండా, పిల్లలను కాపాడుకోవాలి. పిల్లల దినసరి కార్యకలాపాల పట్ల తల్లిదండ్రులు, పాఠశాలల పర్యవేక్షణ తప్పనిసరి. విద్యా వ్యవస్థలో సామాజిక అంశాలు, మానవీయ విలువలు వంటి అంశాలకు ప్రాధాన్యత నివ్వాలి.
- డా. అనిల్ మేర్జ-