తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నాలుగో నగరం ఫ్యూచర్ సిటీలో కొత్త జూపార్క్ ఏర్పాటు కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా జూ ఏర్పాటు చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందుకు సంబంధించి ముఖేష్ అంబానీకి చెందిన వంతరా జూ (Vantara Zoo) నిర్వాహకులతో తెలంగాణ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. కొత్త జూ రూపకల్పన, సాంకేతిక సూచనలు, అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసులపై మార్గదర్శకత్వం అందించే దిశగా సోమవారం (డిసెంబర్ 08) సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందం కుదిరింది.
వంతారా జూ ప్రపంచ స్థాయి జంతు సంరక్షణ, పునరావాసం, శాస్త్రీయ నిర్వహణలో ప్రసిద్ధిపొందిన సంస్థ. అక్కడ అమలు చేస్తున్న వివిధ నమూనాలను తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జూ కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదిరింది.
MoU ప్రధాన అంశాలు:
* వంతారా జూ నిర్వహణలో అమలవుతున్న జంతు సంరక్షణ, పునరావాస చర్యలపై సాంకేతిక సహాయం
* నైట్ సఫారీ రూపకల్పన, నిర్వహణ నమూనాలు, భద్రతా ప్రమాణాలు
* ఫారెస్ట్-బేస్డ్ ఎకో థీమ్ పార్క్ అభివృద్ధికి సాంకేతిక సలహాలు
* పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో జూ అభివృద్ధి కోసం మార్గదర్శకాలు
* ఆధునిక ఎంక్లోజర్లు, వన్యప్రాణి సంక్షేమ ప్రమాణాలు, సందర్శకుల అనుభవం మెరుగుపరిచే ఉత్తమ పద్ధతులపై సహకారం
ఈ అవగాహన ఒప్పందంతో తెలంగాణలో ఏర్పడబోయే కొత్త జూ దేశంలోనే కాక ఆసియా స్థాయిలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మోడల్ జూగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారిణి డాక్టర్ సి సువర్ణ, అటవీ అభివృద్ధి సంస్థ MD సునీత భగవత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
