Mitchell Marsh: షెఫీల్డ్ షీల్డ్‌కు గుడ్ బై.. డొమెస్టిక్ టెస్ట్ క్రికెట్‌కు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ రిటైర్మెంట్

Mitchell Marsh: షెఫీల్డ్ షీల్డ్‌కు గుడ్ బై.. డొమెస్టిక్ టెస్ట్ క్రికెట్‌కు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ రిటైర్మెంట్

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ దేశవాళీ డొమెస్టిక్ టెస్ట్ క్రికెట్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఈ సీజన్ లో తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడిన తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి గుడ్ బై చెప్పనున్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీకి దూరమైనా ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని తెలిపాడు. ఈ సీజన్ షెఫీల్డ్ షీల్డ్ లో ఒకే మ్యాచ్ ఆడిన మార్ష్.. ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 4.. రెండో ఇన్నింగ్స్ లో 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ ఆడటం గౌరవంగా ఉందని మార్ష్ ఒక ప్రకటనలో తెలిపాడు. 

నాలుగు సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉన్న మార్ష్.. 2023 యాషెస్ లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. హెడింగ్లీలో తన పునరాగమన మ్యాచ్‌లో సెంచరీ చేసి దుమ్ములేపాడు. ఈ ఏడాది టీమిండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మార్ష్ ఫామ్ కోల్పోయాడు. పేలవ ఫామ్ కారణంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్టుకు ప్లేయింగ్ 11 నుంచి తొలగించబడ్డాడు. దీంతో దేశవాళీ క్రికెట్ లో ఆడుతూ ఫామ్ సంపాదించే పనిలో ఉన్నాడు. అయితే షెఫీల్డ్ షీల్డ్ నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ అవుతున్నట్టు ప్రకటించి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 

వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున షెఫీల్డ్ షీల్డ్‌లో మార్ష్ 29.50 యావరేజ్ తో 2744 పరుగులు చేయడంతో పాటు 82 వికెట్లు పడగొట్టాడు. మార్ష్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. పాట్ కమ్మిన్స్ లేనప్పుడు వన్డే బాధ్యతలు స్వీకరిస్తాడు. టెస్ట్ క్రికెట్ లో స్థానం కోల్పోయిన ఈ ఆసీస్ ఆల్ రౌండర్ వైట్ బాల్ ఫార్మాట్ లో రెగ్యులర్ ప్లేయర్. బ్యూ వెబ్ స్టర్, కెమరూన్ గ్రీన్ లాంటి ఆల్ రౌండర్లు ఉన్న కారణంగా మార్ష్ ఆసీస్ టెస్ట్ జట్టులో స్థానం కష్టమవుతోంది. ఫిబ్రవరిలో ఇండియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టును నడిపించనున్నాడు.