Krithi Shetty: అర్ధరాత్రి ఆత్మని చూశా.. హోటల్‌లో కృతి శెట్టికి వింత అనుభవం.!

Krithi Shetty: అర్ధరాత్రి ఆత్మని చూశా.. హోటల్‌లో కృతి శెట్టికి వింత అనుభవం.!

కృతి శెట్టి.. ఇప్పుడు కెరీర్‌లోనే అత్యంత బిజీగా గడుపుతున్న యువ నటి.. రెండు సంవత్సరాల విరామం తర్వాత, ఆమె నటించిన మూడు చిత్రాలు - 'వా వాథియార్', (  'అన్నగారు వస్తున్నారు' )  'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', 'జెన్నీ'  విడుదల కాబోతుండడంతో ప్రమోషన్స్‌తో ఉరుకులు పరుగులు పెడుతోంది. ఇటీవల వరుస పరాజయాలతో ఉన్న ఈ బ్యూటీ ఈ సారి గట్టిగా సక్సెస్ ను కొట్టాలని తెగ కష్టపడుతోంది.  స్టార్ హీరో కార్తీతో కలిసి నటించిన ఈ 'వా వాథియార్' సినిమా  డిసెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్ లో  కృతి పాల్గొంది.  తన కెరీర్ లో వేధించిన విమర్శలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు, వాటిని కాలక్రమేణా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్న వైనంతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్యూలో పంచుకుంది ఈ బ్యూటీ .

 కృతి ఎమోషనల్ ..

 తాను పబ్లిక్ ఫిగర్‌గా ఉండడం తన ఉద్యోగంలో భాగమని చెప్పుకొచ్చింది కృతి. "నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ నేను చాలా సున్నితమైన వ్యక్తిని అని తెలుసు. నటన వంటి ఈ అత్యంత డిమాండింగ్ ఉద్యోగంలో ఉన్నప్పుడు..  మిమ్మల్ని మీరు కొద్దిగా కోల్పోయే అవకాశం ఉంది.  అభిమానుల పరిశీలన, విమర్శలు తన అదుపులో లేవని ఆమె పేర్కొంది. నేను సాధారణంగా ఆశావాదిని అయినప్పటికీ, కొన్నిసార్లు నన్ను నేను కొద్దిగా కోల్పోతూ ఉంటాను అని కృతి ఎమోషనల్ అయింది. 

కష్ట సమయాల్లో అండగా..

చిన్న చిన్న సంఘటనలు కూడా నన్ను చాలా ప్రభావితం చేసేవి అని కృతి చెప్పింది.. ఒకానొక దశలో, అది నన్ను వ్యక్తిగతంగా బాధించడం మొదలుపెట్టి, నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది. బాల్యంలో ఎవరైనా నా గురించి కామెంట్ చేసినా నాకు పట్టేది కాదు, కానీ ఇప్పుడెందుకు ఇవన్నీ నన్ను ఇంతలా ప్రభావితం చేస్తున్నాయో తెలియడం లేదు. దానికి నా దగ్గర సమాధానం లేదు అని ఆమె వివరించింది. అయితే, తన తల్లి ఈ కష్ట సమయాల్లో అండగా నిలుస్తోందని కృతి తెలిపింది.  నాఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా దైర్యంగా ఉంటానని ధీమా వ్యక్తం చేసింది.

 దెయ్యంతో కృతి?

కృతి శెట్టి ప్రస్తుతం ప్రచారం చేస్తున్న చిత్రాలలో, కార్తీ హీరోగా నటిస్తున్న 'వా వాథియార్' ఒకటి. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి ఆత్మలతో మాట్లాడే శక్తి ఉన్న జిప్సీ యువతి పాత్రలో కనిపించనుంది. అయితే, అదే పాత్రకు సంబంధించిన వింత అనుభవం ఒకటి షూటింగ్‌కు ఒక రోజు ముందు తనకు ఎదురైనట్లు వెల్లడించింది. సినిమా షూటింగ్‌కు ముందు రాత్రి, కృతి తన తల్లితో కలిసి ఓ హోటల్‌లో బసచేసిందట. ఆ సమయంలో ఒక్కసారిగా ఆమెకు ఒక ఆత్మ రూపం కనిపించిందట. లైటు వేయగానే పెద్ద శబ్దం వచ్చి, ఆ రూపం మాయమైందట. ఈ వింత అనుభవం భయపెట్టేదే అయినప్పటికీ, తన వెంట తన తల్లి ఉండటంతో తాను భయపడలేదని కృతి శెట్టి చెప్పింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కార్తితో పాటు, ఈ సినిమాలో రాజ్‌కిరణ్, సత్యరాజ్, ఆనందరాజ్, కరుణాకరన్, జీఎం సుందర్, శిల్పా మంజునాథ్, రమేష్ తిలక్ వంటి తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది.'వా వాథియార్' తర్వాత, కృతి శెట్టి నటించిన మరో చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఇది డిసెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. రవి మోహన్ సరసన నటిస్తున్న 'జెన్నీ' విడుదల తేదీ ఇంకా ప్రకటించబడలేదు.