ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్: ఇంట్లో దాచుకున్న డబ్బుపై 84% పన్ను!

ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్: ఇంట్లో దాచుకున్న డబ్బుపై 84% పన్ను!

దేశంలో నగదు లావాదేవీలు చేసే వారికి.. మరీ ముఖ్యంగా ఇంట్లో డబ్బు దాచుకునే  వారికి ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు గట్టి షాకిస్తున్నాయి. పాత నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటి అమలు ఇప్పుడు మరింత కఠినతరం కావడంతో.. లెక్కల్లో చూపని నగదు దొరికితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

84% పన్ను అంటే మాటలు కాదు!
 ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించినప్పుడు ఇంట్లో 'లెక్క చూపని డబ్బు' దొరికితే.. దానిపై ఏకంగా 84% పన్ను విధించబడుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్ధక్ అహుజా వెల్లడించారు. ఇందులో పన్ను, పెనాల్టీ, సర్ఛార్జ్, సెస్ అన్నీ కలిసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త టాక్స్ రూల్స్ చాలా కఠినంగా అమలు అవుతున్నట్లు అహుజా అన్నారు. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ప్రజలకు సంబంధించిన డబ్బు లావాదేవీలకు సంబంధించిన డేటా గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉండటం ఈ పనిని సులభతరం చేస్తోందని హెచ్చరించారు. డిజిటల్ చెల్లింపుల వాడకం పెరిగాక ట్రాకింగ్ కూడా ఈజీ అయినట్లు నిపుణులు అంటున్నారు. 

ఆదాయపు పన్ను శాఖకు ఎలా తెలుస్తుంది?
ప్రజలు చేసే పెద్ద మనీ ట్రాన్సాక్షన్స్ గురించి ఆదాయపు పన్ను శాఖకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుందని చాలా మందికి అస్సలు తెలియదు. తమను ఎవ్వరూ గుర్తించటం లేదని, తాము చేసే పనులు తెలియవని చాలా మంది అనుకుంటుంటారు. అయితే..

* ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా వ్యక్తి రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు విత్‌డ్రా చేస్తే.. బ్యాంక్ ఆ వివరాలను ఐటీ విభాగానికి తెలియజేస్తుంది.
* ఒకవేళ విత్‌డ్రా చేసిన మొత్తం రూ.20 లక్షలు దాటితే, బ్యాంక్ విత్‌డ్రా చేసిన మొత్తంపై టీడీఎస్ కూడా కట్ చేయబడుతుంది. 
* పదేపదే పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రాలు చేస్తున్నట్లయితే.. ఆ డబ్బుకు సంబంధించిన ఇన్కమ్ సోర్స్ చూపకపోతే.. ఐటీ శాఖ మీపై సోదాలు చేపట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

100% పెనాల్టీలు.. 
కొన్ని రకాల నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ 'జీరో టాలరెన్స్' విధానాన్ని కొనసాగిస్తోంది. అంటే నిబంధనలు ఉల్లంఘిస్తే 100% పెనాల్టీ విధించబడుతుంది. అంటే మీరు మొత్తం కలిపి అసలు మొత్తానికి రెట్టింపు చెల్లించాల్సి రావచ్చు. దీనికి దారితీసే పరిస్థితులు ఇవే..

1. ఒక రోజులో ఒకే కస్టమర్ నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరించడం.
2. నగదు రూపంలో అప్పు తీసుకోవడం.
3. ఆస్తి అమ్మినప్పుడు రూ.20వేల కంటే ఎక్కువ డబ్బును స్వీకరించడం.

దేశంలో బ్లాక్ మనీ, లెక్కల్లో చూపని డబ్బు, ఆస్తులపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నిబంధనలు కఠినంగా మారాయి. బ్యాంకులు, రిజిస్ట్రార్లు, పన్ను అధికారుల మధ్య మెరుగైన డేటా షేరింగ్ కారణంగా.. ప్రజలు చేస్తున్న ప్రతి లావాదేవీపై నిఘా పెరిగింది. వ్యాపారులు సైతం తమ వద్ద ఉన్న ప్రతి పైసాకు డాక్యుమెంట్స్ చూపించాల్సిందే.  లేదంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం. మీ ఇంట్లో ఉన్న నగదు గురించి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసిందని ప్రతి భారతీయుడూ గుర్తుంచుకోవాలి. ప్రతి రూపాయికీ లెక్క కలిగి ఉండాలి అప్పుడే చిక్కుల్లో పడకుండా ఉంటారు.