హనుమకొండ, వెలుగు: జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాలకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆదివారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండో విడతలో ధర్మసాగర్, హసన్ పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.
మొత్తంగా 789 మంది పీవోలు, 1,154 ఓపీవోలు కేటాయించామన్నారు. పోలింగ్ సిబ్బందికి భోజన వసతి కల్పించడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. డీపీవో లక్ష్మీరమాకాంత్, డీఆర్డీవో మేన శ్రీను, జడ్పీ సీఈవో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
