మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా మళ్లీ సత్య నాదెళ్ల వద్దు

మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా మళ్లీ సత్య నాదెళ్ల వద్దు
  • బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వ్యతిరేకంగా ఓటు వేసిన నార్వే సావరిన్ వెల్త్ ఫండ్‌‌‌‌‌‌‌‌.. అయినా భారీ మెజార్టీతో ఆమోదం

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్  చైర్మన్‌‌‌‌‌‌‌‌గా మళ్లీ సత్య నాదెళ్లను ఎన్నుకోవడాన్ని  నార్వేకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్  వ్యతిరేకించింది.  అంతేకాకుండా ఆయన సాలరీ ప్యాకేజీపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఇతర మేజర్ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్లు సత్య నాదెళ్లను చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఎన్నుకున్నారు. ఆయనే సీఈఓగా కూడా కొనసాగుతారు.  డిసెంబర్ 5న జరిగిన వార్షిక షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్ల సమావేశంలో ఈ అంశాలపై ఓటింగ్ జరిగింది. మైక్రోసాఫ్ట్‌‌లో ఎనిమిదో అతిపెద్ద షేర్ హోల్డర్ అయిన నార్వే సావరిన్ ఫండ్ బోర్డ్ ప్రతిపాదనలను  వ్యతిరేకించింది.   ‘‘ ఒకేసారి సీఈఓ,  బోర్డు చైర్మన్‌‌‌‌‌‌‌‌గా  ఉండటం బోర్డు స్వతంత్రతను బలహీనపరుస్తుంది.  ఆయన  బాధ్యతను తగ్గిస్తుంది”అని ఈ సంస్థ తెలిపింది.  

అలానే,  లాంగ్‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌ షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్ల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే రేమ్యునరేషన్ మోడల్ అవసరమని పేర్కొంది. “వార్షిక వేతనంలో పెద్ద భాగం 5–10 సంవత్సరాల పాటు లాక్డ్‌‌‌‌‌‌‌‌ షేర్ల రూపంలో ఉండాలి” అని ఫండ్ స్పష్టం చేసింది. ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌కు  మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌లో 1.35శాతం వాటా  ఉంది. దీని విలువ దాదాపు 50 బిలియన్ డాలర్లు. చిప్‌‌‌‌‌‌‌‌ల తయారీ కంపెనీ ఎన్విడియాలో కూడా ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌కి వాటాలు ఉన్నాయి.  ఇతర మేజర్ షేర్ హోల్డర్లు  నాదెళ్లకు అనుకూలంగా ఓటు వేశారు.  2024–25 ఆర్థిక సంవత్సరానికి 96.5  మిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఇవ్వడానికి కూడా అంగీకరించారు.  అంతకుముందు ఏడాది  కంటే ఇది 22శాతం ఎక్కువ. ఈ పెరుగుదల ప్రధానంగా స్టాక్ అవార్డుల వల్ల వచ్చింది. కాగా, ఈ ఏడాది  మైక్రోసాఫ్ట్ షేర్లు 23శాతం పెరిగాయి.  గత మూడు సంవత్సరాల్లో రెట్టింపు అయ్యాయి.  ఏఐ రంగంలో నాదెళ్ల సాధించిన పురోగతి వలనే షేర్లు పెరిగాయని బోర్డు పేర్కొంది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014 నుంచి, చైర్మన్‌‌‌‌‌‌‌‌గా 2021 నుంచి కొనసాగుతున్నారు.