సంవిధాన్ పరిరక్షణకు శంఖారావం

సంవిధాన్ పరిరక్షణకు శంఖారావం

 దేశంలోని బడుగు,  బలహీన,  మైనార్టీ వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించినా, ఏవైనా ఆటుపోట్లు ఎదురైనా బలహీన వర్గాలకు అండగా నిలిచేలా డా. బీఆర్.అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు.  అనంతరం దానికి కొనసాగింపుగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దేశంలో రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలయ్యేలా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడంతో భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.  విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న భారత రాజ్యాంగాన్ని మార్చేవిధంగా బీజేపీ,  సంఘ్ పరివార్  కుట్రలు  పన్నుతుండడంతో  కాంగ్రెస్​తో సహా  ప్రజాస్వామ్యవాదులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్  రాజ్యాంగంపై  దుష్ప్రచారం చేస్తూ  ప్రజలను తప్పుదోవ పట్టించి, దేశంలోని బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల హక్కుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నాయి. అంతేకాక రాజ్యాంగ పితామహుడైన అంబేద్కర్​ను తూలనాడుతున్నారు.  దేశంలో  మత సామరస్యానికి ప్రాణాలు అర్పించిన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.  సంఘ్ పరివార్ కుయత్నాలను కాంగ్రెస్  పార్టీ ముందే పసిగట్టి వీటిని అడ్డుకోవాలనే కృత నిశ్చయంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం  దేశవ్యాప్తంగా  కార్యాచరణ  రూపొందించింది.

  కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ  భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టి బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లపై  బీజేపీకి ఉన్న అక్కసును, వారు మైనార్టీల్లో  సృష్టిస్తున్న 
అభద్రతా భావాన్ని ఎండగట్టారు.

బీజేపీకి చుక్కెదురు 

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల హక్కులపై బీజేపీ చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ ఎత్తిచూపడంతోనే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి  చుక్కెదురైంది. ‘అబ్ కీ బార్  చార్ సౌ పార్’ నినాదంతో పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి  అవసరమైన మెజార్టీ రాకపోవడంతో,  ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది.  

రాజ్యాంగంపై  బీజేపీ కుట్రలను  దేశ ప్రజలు స్పష్టంగా తిరస్కరించినా ఆ పార్టీ తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో  కాంగ్రెస్ పార్టీ  ‘జై బాపు,  జై బీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలను  దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో,  పట్టణాల్లో, మండలాల్లో,  జిల్లాల్లో,  నగరాల్లో నిర్వహిస్తోంది.  

దేశవ్యాప్తంగా రాజ్యాంగం పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాడుతుంటే, మరోవైపు సంఘ్ పరివార్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు కుట్రలు పన్నుతోంది.  అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె రాజ్యాంగంలోని లౌకికవాదం,  సామ్యవాదంపై  సమీక్ష  జరగాలన్నారు.  ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంఘ్ పరివార్​కు,  బీజేపీకి  కొత్తేమీ కాదు.  

గతంలో  2024 డిసెంబర్​లో   కేంద్ర హోంమంత్రి అమిత్ షా  పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు ఆరాధ్య దేవుడైన అంబేద్కర్​ను అగౌరవపరిచారు. ఆనాడే  ప్రధాని మోదీ చొరవ తీసుకొని అమిత్​షాపై చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్  నేతలు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు సాహసించేవారు కాదు. 

లౌకికవాదం, సామ్యవాదం ఆవశ్యకత 

2023 సెప్టెంబర్ 19న నూతన పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టిన ఎంపీలకు ప్రభుత్వం అందించిన రాజ్యాంగ ప్రతుల పీఠికలో ఉద్దేశపూర్వకంగా లౌకికవాదం, సామ్యవాదం పదాలను తొలగించారు. దీనిపై అప్పుడే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతోపాటు ఇతర ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, సంఘ్ పరివార్ తరచూ రాజ్యాంగంపై  దాడి చేస్తుండడంతో దేశ ప్రజల ముందు వారి నిజస్వరూపం బహిర్గతమైంది. 

 ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలనలో  ఎదురవుతున్న విపరీత ధోరణులు చూస్తుంటే ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ఎంతో ధైర్యసాహసాలతో తీసుకొచ్చిన లౌకికవాదం, సామ్యవాదం ఆవశ్యకత తెలుస్తోంది.  లౌకిక వాదం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం, అన్ని మతాలకు స్వేచ్ఛ ఇవ్వడం, ఏ మతంపైనా పక్షపాతం, వివక్ష చూపకపోవడం,  ప్రభుత్వం మత కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకపోవడం, పాలనలో మతజోక్యం లేకుండా చూడడం. స్థూలంగా దేశంలో  మత సామరస్యాన్ని పెంపొందించడమే లౌకికవాదం ప్రధాన లక్ష్యం.  అయితే, బీజేపీ ఈ లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ  మైనార్టీల్లో అభద్రతా భావం కలిగిస్తోంది. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు చేయడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలలో భయాందోళనలు కలిగించేలా బుల్డోజర్ పాలన సాగిస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో 2023 మే నుంచి మతకలహాలు జరుగుతున్నా  ప్రధాని మోదీ ఒక్కసారి కూడా అక్కడ పర్యటించకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.  బీజేపీ,  సంఘ్ పరివార్  అరాచకాలను చూస్తుంటే ప్రస్తుతం దేశంలో లౌకికవాదం ఎంత అవసరమో స్పష్టమవుతోంది.

రిజర్వేషన్లపై కుట్రలు

సామ్యవాదం పేరు వింటేనే బీజేపీ, సంఘ్ పరివార్ లు బెంబేలెత్తుతున్నాయి. సామ్యవాదం ప్రధాన లక్ష్యం పెత్తందారీ వ్యవస్థకు భిన్నంగా దేశంలో బడుగు, బలహీన వర్గాలకు  సమానత్వం, సామాజిక న్యాయం అందించడం. ఇందుకు  దేశ సంపదను,  వనరులను అందరకీ సమానస్థాయిలో, న్యాయంగా పంపిణీ చేయడంతోపాటు పేదల సంక్షేమానికి కృషి చేయడం.  సామ్యవాదంలో భాగంగా బడుగులందరికీ న్యాయం జరిగేవరకు అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను కొనసాగించాల్సి ఉన్నా.. దానికి భిన్నంగా రిజర్వేషన్లపై బీజేపీ కుట్రలు పన్నుతోంది. 

సంక్షేమానికి కాంగ్రెస్​ పెద్దపీట

సామాజిక అంశంలోనే కాకుండా ఆర్థిక విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దేశ సంపదను, వనరులను పెట్టుబడిదారులు కొల్లగొట్టి  విదేశాలకు పారిపోయినా బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తూ కుర్చుంది.

 సామ్యవాద విధానంలో ప్రభుత్వం 

సంక్షేమాలతో  ప్రజలను ఆదోకోవాల్సి ఉండగా,  కేంద్ర ప్రభుత్వం పన్నులు, జీఎస్టీ పేరుతో పేదల నడ్డి విరుస్తోంది.  కేంద్రంలోని  బీజేపీ  ప్రభుత్వం  ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంటే,  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రజారంజక పాలన చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి,  సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.  సామాజిక న్యాయం అందించడమే కాకుండా మహిళలు, రైతు,  యువత, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల సంక్షేమానికి పలు పథకాలను  ప్రవేశపెట్టి  పేదలను ఆదుకుంటోంది. 

సెక్యులర్,  సోషలిస్టు పదాలను తొలగించాలని కొందరు  బీజేపీ నేతలు సుప్రీంకోర్టును  ఆశ్రయించగా  2024 నవంబర్​లో ఉన్నత  న్యాయస్థానం కొట్టివేసినా వారిలో మార్పు రాలేదు.  భిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో  భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో  ప్రజలందరికీ సమన్యాయం జరగాలంటే రాజ్యాంగ ఫలాలు బడుగులందరికీ దక్కాలి. 

స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి దేశ ప్రజల స్థితిగతులు,  విశ్వాసాలపై  పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బడుగు, బలహీన, మైనార్టీలకు అండగా నిలుస్తోంది.  బీజేపీ, సంఘ్  పరివార్  తమ  ముసుగును  తొలగించుకొని దేశ ప్రజలు పవిత్రంగా  విశ్వసించే  రాజ్యాంగానికి తూట్లు పొడవాలని చూస్తుంటే,  రాజ్యాంగం పరిరక్షణకు  కాంగ్రెస్ పార్టీ  కంకణం కట్టుకుంది. 

భారత సంవిధాన్  పరిరక్షణ  కోసం కాంగ్రెస్ శంఖారావం పూరించింది.  కాంగ్రెస్ అధిష్టానం పిలుపు అందుకొని  తెలంగాణ  కాంగ్రెస్  ‘జై బాపు, జై బీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలను 
రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, సామ్యవాదాన్ని కాపాడుకునేందుకు  కాంగ్రెస్  చేపడుతున్న రాజ్యాంగ  పరిరక్షణ  కార్యక్రమాలకు ప్రజలు,  ప్రజాసంఘాలు, మేధావులు చేయిచేయి కలిపి మద్దతుగా నిలవాలి.  

కుల గణన విజయవంతం

బడుగు, బలహీన వర్గాలకు  సామాజిక న్యాయం దక్కేందుకు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించిన రాహుల్ గాంధీ  దీర్ఘకాలికంగా  ఒత్తిడి  తెస్తుండడంతో  మోదీ ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది.  బీజేపీ  ప్రభుత్వం కులగణన చేపట్టడానికి ముందుకురావడం ఒక రకంగా తెలంగాణలోని  రేవంత్ రెడ్డి సర్కారే కారణం.  

తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా కులగణనను విజయవంతంగా పూర్తి చేసింది.  దీంతో  దేశవ్యాప్తంగా కులగణనపై డిమాండ్లు పెరగడంతో  బీజేపీ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో తలొగ్గింది.  కేంద్ర ప్రభుత్వం  కాలయాపన  చేయకుండా  త్వరగా  కులగణన  పూర్తి చేసి  దేశంలో సామాజిక న్యాయం అందించేవరకు కాంగ్రెస్ ప్రజాపక్షాన  పోరాడుతుంది.

- బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు-