పెబ్బేరు, వెలుగు : మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని, తెలంగాణలోని మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం డీసీసీ ప్రెసిడెంట్ శివసేనారెడ్డితో కలిసి పెబ్బేరు మున్సిపాలిటీలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేక పొలాల్లో అడవి పందులు రాకుండా కట్టుకోవడానికి మాత్రమే పనికొచ్చాయని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న చీరలు ఎంతో నాణ్యంగా ఉండటంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, సోలార్ ప్లాంట్ల యాజమాన్యం లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో వారి ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రానున్న రోజుల్లో సూపర్ మార్కెట్లు, రైస్ మిల్లులు, గోదాముల నిర్వహణను సైతం మహిళలకే అప్పగించేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కరుణశ్రీ , వైస్ చైర్‌పర్సన్ సుమిత్ర, ఏఎంసీ చైర్‌పర్సన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
