కారు, సారు బేజారు..వెంటాడుతున్న మార్పు

కారు, సారు బేజారు..వెంటాడుతున్న మార్పు

తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు రాజకీయ శక్తిగా నిలిచి సహకరించిన బీఆర్ఎస్..సెంటిమెంటుతో అధికారం పొందిన మరుక్షణమే ప్రజల ఆకాంక్షలను విస్మరించింది. స్వీయ వర్గ ఆధిపత్య ప్రయోజనాలను అమలులో  పెడుతున్న క్రమాన్ని మొదటి నుంచి మేధావులు, ఉద్యమకారులు పసిగడుతూనే ఉన్నా  ఉపేక్షించారు. చావు నోట్లో  తల పెట్టి తానొక్కడినే తెలంగాణ తెచ్చినా అని బుకాయించి, తన పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతున్నదనీ  కేసీఆర్ చెప్పి ఉద్యమకారులను తీవ్ర అవమానానికి  గురి చేసిండు. పుండు మీద కారం చల్లినట్టు  తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన తెదేపా నాయకులకు రెడ్​ కార్పెట్ పరిచి ఆహ్వానించి కీలక మంత్రి పదవులు ఇచ్చిండు. వారిలో  కొంతమందికి కాంట్రాక్టులు,  కార్పొరేట్​ విద్య, వైద్య, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టబెట్టిన నాడే  తెలంగాణ వాదులైన ఉద్యమకారులను, మేధావులను బీఆర్ఎస్  దూరం చేసుకున్నది. కేవలం కొద్దిమంది అవకాశవాదులైన మేధావులు తమ స్వీయ ప్రయోజనాలకు మాత్రమే ఆ పార్టీతో కలిసి ఉన్నారు.  ప్రగతి భవన్​లో అంటకాగుతూ  అప్పుడప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు. 

ఉద్యమకారులను బీఆర్ఎస్​ బేఖాతరు

ఉద్యమ సందర్భంగా ప్రజలు నినదించిన అంశాలను, రెండు పర్యాయాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ బేఖాతరు చేసింది.   బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అధికారంలో, అభివృద్ధిలో మొండిచేయి చూపించడంతో  ఆ వర్గాలు క్రమంగా దూరమైనారు. బీజేపీతో పరోక్ష సంబంధాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంతో మైనారిటీలు కూడా వెనుతిరుగుతున్నారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానం  గాలి మాటగానే మిగిలిపోయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్​లో జరిగిన అవకతవకలు, స్కాములు, ప్రశ్నపత్రాల విక్రయాలు 30 లక్షల మంది నిరుద్యోగుల పాలిట శాపాలుగా మారాయి. ఉద్యోగులు, పెన్షనర్లు నిర్లక్ష్యానికి గురి అయ్యి ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. 53శాతం ఉన్న బీసీ వర్గాలను ప్రభుత్వం అణచివేసింది.

సీఎం కేసీఆర్​కు గుణపాఠం

ఓటర్లను మభ్యపెట్టి  2018లో అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్​కు యువకులు, ఉద్యమకారులు కేవలం నాలుగు నెలల కాల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. ఆత్మీయ బంధువు బోయినపల్లి వినోదరావు, అదేవిధంగా తన ముద్దుల పట్టి  కవితను కూడా చిత్తుగా ఓడించారు.  కాంగ్రెస్ పార్టీకి మూడు, బీజేపీని నాలుగు  పార్లమెంటు స్థానాల్లో గెలిపించారు.  80 వేల పుస్తకాలు చదివి ఆపోశన పట్టిన కేసీఆర్​ తన పాలనలో వివిధ వర్గాల ప్రజల మనోభావాలను లెక్కపెట్టలేదు.  కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాల అభివృద్ధికి, రాజకీయ అధికారానికి కేసీఆర్​ కృషి చేసిండని అపవాదు మోస్తున్నాడు. తెలంగాణ ఉద్యమం ద్వారా ఏర్పడిన సెంటిమెంటు క్రమంగా కరిగిపోతున్నది. దీంతో ఆగ్రహావేశాలతో ప్రజలు బీఆర్ఎస్​ అభ్యర్థులను అనేక గ్రామాల్లో నిలదీస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీల  బలోపేతానికి స్వచ్ఛందంగా కృషి చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

కొత్త జిల్లాలకు నిధుల కొరత

మంత్రులతోపాటు అనేకమంది ప్రజాప్రతినిధులు వారి బంధువర్గ సభ్యులు అమలుపరిచిన దోపిడీ, అవినీతి, భూకబ్జాలు, మాఫియా సంస్కృతి తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి గురి చేశాయి. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే సభ్యసమాజం చూడకుండా ఎలా ఉంటుంది? అభివృద్ధి అనేది గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలకే పరిమితమైందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలన్నీ నిధులు లేక, ఆదరణ లేక వట్టిపోతున్నాయి. యువత ఉపాధి, ఉద్యోగాలు లేక అశాంతికి గురవుతున్నారు.  వరంగల్ లాంటి ప్రముఖ నగరాన్ని ముక్కలు చెక్కలు చేసి అభివృద్ధి లేకుండా చేసిండని ఉమ్మడి జిల్లా ప్రజలు తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు.

ప్రజాకంటకులుగా పాలకులు

 ఎన్నికైన ప్రజాప్రతినిధులలో అనేకమంది ప్రజాకంటకులుగా అవతారమెత్తి పేద, మధ్యతరగతి, వ్యవసాయదారుల భూములు, పట్టణ ప్రాంత కమర్షియల్ భూములకు ఎసరు పెట్టడం జరిగింది. అవినీతి అధికారుల అండదండలతో ప్రజా ప్రతినిధులు సాధారణ, మధ్య, క్రింది స్థాయి కుటుంబాలను వివిధ రకాల వేధింపులకు గురి చేశారు. అనేక నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, అటవీ భూములను అధికార నాయకులే సొంతం చేసుకున్నారు. ఒక్కొక్కరూ వందలాది ఎకరాలకు యజమానులై ప్రజాగ్రహాన్ని మూట కట్టుకున్నారు. ప్రస్తుతం టికెట్లు పొందిన శాసనసభ్యులలో కనీసం 50శాతం మంది సభ్యులు అక్రమార్కులని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారుల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేశారని స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ భవన్ సాక్ష్యంగా  ప్రకటించి,  తిరిగి వారికే  టికెట్లు ఇస్తే ప్రజలు ఎలా అంగీకరిస్తారు? 

తెలంగాణ ప్రజల నెత్తిపై అప్పుభారం

వరుస దెబ్బలతో కుంగిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గుదిబండగా మారింది. లక్షా 30 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుటుంబ సభ్యులు, ఆంధ్రా కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు, అస్మదీయులు సొంతం చేసుకొన్నారు.  తెలంగాణ ప్రజల నెత్తిపై ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు భారాన్ని మిగిల్చారని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యమాన్ని ఉపయోగించుకొని అధికారం పొందిన కేసీఆర్​ ఉద్యమకారులను, విద్యావంతులను, నిరుద్యోగులను,  ప్రభుత్వ ఉద్యోగులను, బలహీన వర్గాలను అవమానాలకు గురిచేసి దూరం  చేసుకున్నారు. చివరికి పాలక పక్షానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తితో పరోక్షంగా మార్పు కోరుకుంటున్నారు.

మార్పుకోసం తపిస్తున్న ప్రజలు

పాలక పక్ష నాయకులు డబ్బు సంచులను నమ్ముకొని అవినీతి అధికారుల అండదండలతో అధికారాన్ని పొందవచ్చునని చివరి అస్త్రంగా భావిస్తూ ఉండవచ్చు. కానీ, ప్రజలు మార్పు కోసం తపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉప్పెనలాగా ముంచుకొస్తున్నది. కల్వకుంట్ల ప్రభుత్వ బాధితులంతా దండుగట్టి ఏకమవుతున్నారు. సునామీ వచ్చినప్పుడు తాటి చెట్లే కాదు మర్రి చెట్లు లాంటి భారీ వృక్షాలు కూడా కూలిపోతాయి. డిసెంబర్ మూడవ తేదీన బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి తలవంచక తప్పదని విశ్లేషకుల అభిప్రాయం.

తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్​

1969 మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో  ఆనాటి పార్లమెంటు ఎన్నికల్లో  అభ్యర్థుల కృషి లేకుండానే  విద్యార్థులే స్వచ్ఛందంగా తెలంగాణ ప్రజాసమితిని గెలిపించారు.  ఇప్పుడు కూడా యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షనర్లు, మైనార్టీలు, బీసీలు తమ పార్టీల జెండాలు పక్కకు పెట్టి రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థను ఓడించాలని నిశ్చయించుకున్నారు. కేసీఆర్​ సర్కారు బహుజన వర్గాల ప్రాధాన్యతను తగ్గించి వారి అభివృద్ధికి మూలాధారాలైన విద్యా సంస్థలను ఉద్దేశ పూర్వకంగా  నిర్వీర్యం చేసినారని అభిప్రాయపడుతున్నారు. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు తెరాసను భారాసగా మార్చి తెలంగాణ ఆస్తిత్వాన్ని కేసీఆర్​ దెబ్బతీయడంతో అన్ని వర్గాల ప్రజలలో  తీవ్ర అసంతృప్తి  ఏర్పడింది. తెలంగాణను ముఖ్యమంత్రి తన సామాజిక వర్గానికి జేబు సంస్థగా మార్చిన విధానం రాష్ట్రంలోని 99శాతం ప్రజలకు ఆగ్రహం కలిగించింది.

- కూరపాటి  వెంకట్ నారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్, కాకతీయ వర్సిటీ