ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోడమీద పిల్లిలా బీఆర్ఎస్

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోడమీద పిల్లిలా బీఆర్ఎస్
  • పగలో మాట, రాత్రో మాట అంటే కుదరదు: సీపీఐ నారాయణ
  • ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ గోడమీద పిల్లిలా ఉంటానంటే కుదరదని, పగలో మాట, రాత్రో మాట అంటామంటే తెలంగాణ చూస్తూ ఊరుకోదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఇప్పటికే బీజేపీతో అంతర్గత ఒప్పందం కారణంగా పతనావస్థకు చేరారని, ఇకనైనా మారాలని హితవు పలికారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. 

ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చిన వ్యక్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతివ్వరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసినందునే ఆయనకు మద్దతు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అనడం సరికాదన్నారు. యూరియాకు ఉప రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధం ఏమిటని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించారు. అసలు.. కేంద్రాన్ని కేటీఆర్ యూరియా అడిగారో లేక యూరిన్ అడిగారో అర్థం కావడం లేదన్నారు. ఇవన్నీ బీఆర్ఎస్ పనికిమాలిన వేశాలని ఫైర్ అయ్యారు. 

ఇండియా కూటమి నుంచి ఆప్ వైదొలిగినా.. కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు సైతం సుదర్శన్ రెడ్డికి మద్దతునిచ్చి వారి స్థాయిని పెంచుకోవాలని సూచించారు. మరోవైపు, నిరాశ, నిస్పృహలతోనే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అమిత్ షా.. నక్సలైట్ అని మాట్లాడుతున్నారని అన్నారు. ఒక గొప్ప వ్యక్తిని కమ్యూనిస్టుగా అభివర్ణించడంపై మోదీ, అమిత్ షాకు అభినందనలు తెలిపారు. 

దేశ స్వాతంత్ర్య చరిత్రలో ఉపాధ్యక్ష పదవిలో ఉన్న మాజీ ఉప రాష్ట్రపతి ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏం జరిగిందో, ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదన్నారు. ఆ సంఘటన తర్వాత ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖడ్ బయటికే రాలేదన్నారు. అసలు ఆయన బతికి ఉన్నారో? లేదో? తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.