గులాబీ వ్యూహం.. మూడు చోట్ల క్యాండిడేట్లు చేంజ్?

గులాబీ వ్యూహం.. మూడు చోట్ల క్యాండిడేట్లు చేంజ్?
  • 4 స్థానాలపై తర్జన భర్జన
  •  పటాన్ చెరు అభ్యర్థిని మార్చే చాన్స్?
  • అంబర్ పేట నుంచి వెంకట్ రెడ్డి పోటీ!
  • మల్కాజ్ గిరి బరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి
  •  జనగామపై కొనసాగుతున్న సస్పెన్స్
  • నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి నుంచి బరిలో నిలిచేదెవరో..?
  •  అక్టోబర్ లో ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు కసరత్తు

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ముగ్గురు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని సమాచారం. క్యాండిడేట్లను ప్రకటించని నాలుగు చోట్ల ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై గులాబీ పార్టీ తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అక్టోబర్ రెండో వారంలోపు క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నది. అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అభ్యర్థి కడియం శ్రీహరితో చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. జనగామ సీటును హోల్డ్ లో పెట్టిన నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలనే అంశంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో చర్చించారు. అయితే ఏం చెప్పారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలిపోయింది. టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది తేలడం లేదు. 

అయితే ముత్తిరెడ్డి మాత్రం తనకు సానుకూలంగా వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. దాదాపు నలభై సంవత్సరాల పాటు బీజేపీలో కొనసాగిన గ్రేటర్ మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఆయన సతీమణి బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ లో చేరారు. అంబర్ పేట అసెంబ్లీ సీటును ఆశించిన వెంకట్ రెడ్డి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి కలిసి చర్చించేందుకు ప్రయత్నించారు. ఆయన టైం ఇవ్వకపోవడంతో కలత చెందినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. విస్తృతంగా ప్రజాసంబంధాలు కలిగిన వెంకట్ రెడ్డిని అంబర్ పేట బరిలోకి దించి కిషన్ రెడ్డికి చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానాన్ని బీఆర్ఎస్ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కు కేటాయించింది. దీంతో ఆ స్థానంలో మార్పు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. పటాన్ చెరు టికెట్ ఆశించిన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు చివరి క్షణంలో భంగ పడ్డారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆయన స్వరం పెంచారు. ముదిరాజ్ సామాజికవర్గ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పెద్ద ఓటు బ్యాంకు ఉన్న ముదిరాజ్ లు పార్టీకి వ్యతిరేకంగా మారితే కష్టమని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలు ఈ సెగ్మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్ చెరు టికెట్ కేటాయించారు. ఆ స్థానంలో మార్పు ఉండే చాన్స్ ఉందని సమాచారం. మరో సెగ్మెంట్ మల్కాజ్ గిరి అభ్యర్థిని తప్పక మార్చాల్సిన పరిస్థితి కారు పార్టీది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మల్కాజ్ గిరి పార్లమెంటు సెగ్మెంట్ ఇన్ చార్జిగా కొనసాగుతున్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బరిలోకి దిగుతారని తెలిసింది. పార్టీ అధిష్టానం హామీ మేరకే ఆయన ఇటీవల మల్కాజ్ గిరిలో ర్యాలీ నిర్వహించారని తెలుస్తోంది. క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నాల్లో ఆయన తలమునకలై ఉన్నట్టు సమాచారం. 

మెదక్ జిల్లా నర్సాపూర్ స్థానాన్ని హోల్డ్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ సెగ్మెంట్ ను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆశిస్తున్నారు. మదన్ రెడ్డి తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తుండగా, సునీతా లక్ష్మారెడ్డి మంత్రి కేటీఆర్ ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నాంపల్లి నుంచి ఎవరిని బరిలోకి దించుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ఈ స్థానంలో ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున ఫిరోజ్ ఖాన్ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. ఇక్కడి నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ కు 17వేల ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున ఎవరికి అవకాశం ఇస్తారనేది తేలాల్సి ఉంది. సిటీలో మరో కీలక నియోజకవర్గం గోషామహల్. ఇక్కడి నుంచి 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుపొందారు. ఇటీవల రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆయన బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూర్చేలా ఆయన హరీశ్​ రావుతో భేటీ కావడం సంచలనంగా మారింది. తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీని వీడనని, తనపై సస్పెన్స్ ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్థానం నుంచి విక్రంగౌడ్ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గోషామహల్ సెగ్మెంట్ ఇన్ చార్జి నందకుమార్ వ్యాస్, ఆశీశ్ కుమార్ యాదవ్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. వ్యాస్ 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

అక్టోబర్ లో ఫైనల్!!

ఎన్నికల తేదీలు సమీపిస్తుండటం.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనుండటంతో బీఆర్ఎస్ అలెర్టయ్యింది. ఒకటి రెండో వారాల్లో ఫుల్ జాబితా ఇవ్వనుంది. ఇందుకోసం పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గ్రౌండ్ వర్క్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. పెండింగ్ లో పెట్టిన నాలుగు స్థానాలతో పాటు అభ్యర్థులను మార్చే మూడు చోట్ల ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తూ రిపోర్ట్ తెప్పించుకొని అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ కట్ చేస్తే వారు రెబల్ గా బరిలోకి దిగకుండా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేసుకుంటున్నారని సమాచారం.