ఎగ్జిట్ పోల్స్‎తో సంబంధం లేదు.. జూబ్లీహిల్స్‎లో గెలవబోయేది బీఆర్ఎస్సే: మాగంటి సునీత

ఎగ్జిట్ పోల్స్‎తో సంబంధం లేదు.. జూబ్లీహిల్స్‎లో గెలవబోయేది బీఆర్ఎస్సే: మాగంటి సునీత

హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్‎తో మాకు సంబంధం లేదని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవబోతుందని ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం (నవంబర్ 14) జూబ్లీహిల్స్ బైపోల్ ఓట్ల లెక్కింపు  జరగనున్న నేపథ్యంలో ఆమె కౌంటింగ్ కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా సునీత మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మేమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కొందరు రిగ్గింగ్ చేసి గెలవాలని చూశారని ఆరోపించారు. 

ఇదిలా ఉంటే.. కౌంటింగ్ సెంటర్‎లోకి తన వెంట ఇద్దరు ఏజెంట్‎లను లోపలికి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కోరారు. ఆమె అభ్యర్ధనకు పోలీసులు, ఎన్నికల సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక అభ్యర్థి‎తో ఒక ఏజెంట్‎కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీంతో సునీత వెంట ఒక ఏజెంట్‏ను మాత్రమే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతి ఇచ్చారు సిబ్బంది. 

కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‎కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం 8 గంటల నుంచి యూసఫ్‎గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ మొదలుకానుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేయనున్నారు. ఉదయం 11.30 లోపు జూబ్లీహిల్స్ కింగ్ ఎవరనేది తెలిసిపోయే అవకాశం ఉంది.