
= మైనార్టీ అభ్యర్థి రంగంలోకి దించే చాన్స్?
= ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో రహస్య సర్వే
= అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో గులాబీ టీం
= సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు యత్నాలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ మొత్తం 3,94,886 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,07,932 మహిళలు 1,86,935, ఇతరులు 19 మంది ఉన్నారు. వీరిలో ముస్లింల ఓట్లే 1.23 లక్షలు కావడం గమనార్హం. ఇక్కడి నుంచి గెలవాలంటే తప్పకుండా ముస్లిం ఓట్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సెగ్మెంట్ 2009లో కొత్తగా ఏర్పాటైంది.
తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, దివంగత మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్ తన సమీప ప్రత్యర్థి, ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఓడించారు. ఆ తర్వాత గోపీనాథ్ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. 2023 ఎన్నికల వరకు ఆయన విజయం సాధిస్తూ వచ్చిన ఆయన ఇటీవలే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో పేద ముస్లింలు నివసించే బస్తీలే ఎక్కువగా ఉన్నాయి. ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్ గూడ, వెంగళరావు నగర్, రహ్మత్ నగర్, షేక్ పేట్ వంటి డివిజన్లు దీని పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ సారి మైనారిటీ అభ్యర్థిని బరిలో దించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ కు 43% ఓట్లు!
వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ నేతృత్వంలో పకడ్బందీగా సర్వే చేయించింది. ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై నాలుగు టీమ్స్ నుంచి కచ్చితమైన గ్రౌండ్ రిపోర్టు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తే 43% ఓట్లు సాధిస్తుందని రిపోర్టు వచ్చినట్టు సమాచారం. ఇదిలా క్యాండిడేట్లుగా ఎవరిని పెట్టాలన్న దానిపైనా పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది.
►ALSO READ | కేసీఆర్ పాలనలోనే నీటి వాటాలో తెలంగాణ అన్యాయం : మంత్రి ఉత్తమ్ కుమార్
దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత, రావుల శ్రీధర్ రెడ్డి, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు ప్రాథమికంగా పరిశీలించినట్టు సమాచారం. అయితే అభ్యర్థి గెలుపునకు మైనార్టీల ఓట్లు కీలకం కావడంతో ఏం చేద్దామనే యోచనలో పడింది గులాబీ పార్టీ. ఆ సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ భవన్ లో మైనార్టీ నేతలతో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది.