
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. సోమవారం (ఆగస్ట్ 4) ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్ కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్ అని, నివేదిక అందరూ ఊహించిందేనని అన్నారు. ఈ వ్యవహారంలో కొందరు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతమాత్రాన ఎవరూ భయపడ వద్దన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న వాడు అజ్ఞాని అని చెప్పుకొచ్చారు. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీ నేతలంతా తిప్పికొట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని చెప్పారు. కాళేశ్వరంపై కేబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని అన్నారని సమాచారం. ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు.