కోదాడ, వెలుగు: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండకుండా టూరిస్ట్ లా వ్యహరిస్తున్నారని, దీంతో కొందరు కాంగ్రెస్ నాయకులు షాడో ఎమ్మెల్యేల అవతారమెత్తి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ఆదివారం కోదాడ పట్టణంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కాంగ్రెస్ కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్త కర్ల రాజేశ్‌ను చిత్రహింసలకు గురిచేస్తే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణ సీఐ శివశంకర్ పూర్తిగా కాంగ్రెస్ తొత్తుగా మారారన్నారు. నియోజకవర్గంలో ఇసుక దందా నడిపిస్తున్నారని, ఆయన ఉంటే మున్సిపల్ఎన్నికలు ప్రశాంతంగా జరగవని పేర్కొన్నారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేశారు. బీఆర్ఎస్హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారులను డబుల్బెడ్రూం ఇండ్లలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. అనర్హులు ఉంటే తప్పించి, మిగతావారికి ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి సవాల్‌విసిరారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీం, నాయకులు సత్యబాబు, ఉపేందర్, రమేశ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
