పొలాలు ఎండుతుంటే చోద్యం చూస్తున్నరు : నిరంజన్‌‌రెడ్డి

పొలాలు ఎండుతుంటే చోద్యం చూస్తున్నరు : నిరంజన్‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్‌‌ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌‌రెడ్డి విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పంటలు ఎండిపోయి బాధపడుతున్న రైతుల దగ్గరికి కాంగ్రెస్‌‌ మంత్రులు, నేతలు ఎందుకు వెళ్లట్లేదని ఆయన ప్రశ్నించారు.

రైతుల దగ్గరికి పోయే ధైర్యం కాంగ్రెస్‌‌ నాయకులకు లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి వస్తే.. ఏదో వస్తుందని ప్రజలు ఆశపడ్డారని, ఇప్పుడు పొలాలు ఎండి ఆవేదన చెందుతున్నారని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును చూస్తే జాలేస్తోందన్నారు. ఎవరినో మెప్పించడానికి ఆయన పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు చేసినవన్నీ తుమ్మలకు తెలుసన్నారు.

చేతనైతే రైతు భరోసా రూ.15 వేలు ఇప్పించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్‌‌ చేశారు. తాము చేసినదానికంటే రైతులకు ఎక్కువ మేలు చేయాలని సూచించారు. ఉత్తర తెలంగాణలో సగటుకంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందని, దక్షిణ తెలంగాణలో వర్షపాతం కొంచెం తక్కువ ఉందని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వరద గోదావరిలో గత వర్షాకాలంలో వచ్చిందన్నారు. అత్యధిక వరద వల్లనే మేడిగడ్డ బ్యారేజీలో రెండుమూడు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌‌ తెచ్చిన కరువని నిరంజన్ రెడ్డి ఆరోపించారు.