
- వీటిపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తా: వినోద్ కుమార్
హైదరాబాద్, వెలుగు: కేంద్రం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని బీఆర్‌ఎస్ నేత బి.వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త క్రిమినల్ చట్టం ప్రకారం.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసేలా నిబంధనలు తెచ్చారని, దీంతో ఈ రూల్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
అలాగే, పోలీస్ కస్టడీని 14 రోజుల నుంచి 90 రోజులకు పెంచారని, దీని వల్ల బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యులను బయటకు పంపి బిల్లును కేంద్రం పాస్ చేయించుకుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ లాయర్లు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి, న్యాయ శాఖ మంత్రులకు లేఖ రాశానని వినోద్ వెల్లడించారు. ఈ చట్టాలపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలిపారు.