రోడ్ల విస్తరణ పేరుతో బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం : మాజీ మంత్రి చిన్నారెడ్డి

రోడ్ల విస్తరణ పేరుతో బీఆర్ఎస్  నేతల దౌర్జన్యం : మాజీ  మంత్రి చిన్నారెడ్డి
  • వనపర్తిలో రోడ్డుపై బైఠాయించి మాజీ మంత్రి చిన్నారెడ్డి నిరసన
  •  అడ్డుకున్న  బీఆర్ఎస్ నాయకులు

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లా కేంద్రంలో  రోడ్ల విస్తరణ పేరుతో అధికార బీఆర్ఎస్  నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ  మాజీ  మంత్రి చిన్నారెడ్డి ఆదివారం రోడ్డుపై  బైఠాయించారు.  కోర్టు స్టే ఉన్నా sబిల్డింగులను అర్ధరాత్రి కూల్చివేస్తున్నారని, పోలీసులు, మున్సిపల్ ఆఫీసర్లు చట్టాన్ని అతిక్రమించి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో  రోడ్డుపై  బైఠాయించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్  లీడర్లు అక్కడికి వచ్చి చిన్నారెడ్డి నిరసనకు అడ్డు తగిలారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్,   వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,  లక్ష్మి  నారాయణ, ఉగ్లం తిరుమల్ తదితరులు చిన్నారెడ్డి తీరుపై విమర్శలు చేశారు. 

గతంలో చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే వనపర్తి రోడ్ల విస్తరణపై మున్సిపాలిటీలో తీర్మానం చేశారని, వంద ఫీట్ల వెడల్పు చేయాలని సూచించిన ఆయన ఇప్పుడు ఓట్ల కోసం రాజకీయం  చేస్తున్నారని వాదనకు దిగారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.  చిన్నారెడ్డి  సైతం బీఆర్ఎస్ పార్టీ లీడర్ల తీరును ఎండగట్టారు.  ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రార్థన మందిరాలను తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి లోని గాంధీ చౌక్, అంబేద్కర్​ చౌక్ ల  ప్రాధాన్యాన్ని గుర్తించకుండా  విగ్రహాలను అనవసరంగా మార్చారని మండిపడ్డారు.  రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా  పక్కకు తరలించాలని చూస్తున్నారని అదే జరిగితే అందర్నీ కాల్చివేస్తానంటూ ఆయన హెచ్చరించారు.  దీంతో ఇరు పార్టీల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకొని ఇరుపక్షాలకు సర్దిచెప్పి నిరసన విరమింపజేశారు.