మా పార్టీ ఫ్లెక్సీలను ఎట్ల తొలగిస్తరు?

మా పార్టీ ఫ్లెక్సీలను ఎట్ల తొలగిస్తరు?
  • బల్దియా ఎన్​ఫోర్స్​మెంట్ సిబ్బందిపై బీఆర్ఎస్ లీడర్ల దాడి
  • బాలాజీనగర్​ డివిజన్​లో ఘటన

మూసాపేట, వెలుగు: కూకట్​పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్​లోని ఫ్లెక్సీలు తొలగిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్ సిబ్బందిపై బీఆర్ఎస్ లీడర్లు దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు ఎన్​ఫోర్స్ మెంట్ సిబ్బంది సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు భరత్ నగర్ నుంచి జేఎన్టీయూ వరకు మెయిన్​రోడ్​పై ఉన్న ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.

ఎన్​ఫోర్స్​మెంట్ సూపర్​వైజర్ శివ, సిబ్బంది కె.రాజు, నాగబాబు, అంజయ్య, డీసీఎం డ్రైవర్ ఎం.రాజు వివేక్ నగర్ కమాన్ వద్ద ఫ్లెక్సీలను తొలగిస్తుండగా 10 మంది బీఆర్ఎస్ లీడర్లు అక్కడికి వచ్చారు. తమ పార్టీ ఫ్లెక్సీలను ఎందుకు తీసేస్తున్నారంటూ సిబ్బందిని బూతులు తిట్టారు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకే ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని చెప్పినా వినకుండా ప్లాస్టిక్ పైప్​లతో సిబ్బందిపై దాడికి దిగారు. తమపై దాడి చేసిన వాళ్లలో ఇద్దరిని గుర్తించామని, అందులో ఒకరు బీఆర్ఎస్​కూకట్​పల్లి డివిజన్ అధ్యక్షుడు సంతోశ్ అని, మరొకరు డివిజన్ కార్యదర్శి ప్రభాకర్ అని బాధిత సిబ్బంది చెప్పారు. దాడి విషయాన్ని డిప్యూటీ కమిషనర్ రవికుమార్​కు చెప్పామని.. ఆయన సూచన మేరకు కూకట్ పల్లి పీఎస్​లో కంప్లయింట్ చేశామన్నారు.