నిజామాబాద్​ జెడ్పీ మీటింగ్​ను బహిష్కరించిన బీఆర్​ఎస్​ సభ్యులు

నిజామాబాద్​ జెడ్పీ మీటింగ్​ను బహిష్కరించిన బీఆర్​ఎస్​ సభ్యులు
  • నిజామాబాద్​ జెడ్పీ మీటింగ్​ను బహిష్కరించిన బీఆర్​ఎస్​ సభ్యులు
  • జిల్లాకు వస్తున్న కేటీఆర్​కు తమ బాధ తెలియాలని నిర్ణయం
  • సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేయించినా 
  • బిల్స్​ ఇవ్వడం లేదని ఆవేదన.. జెడ్పీ చైర్మన్​ తీరుపైనా అసంతృప్తి
  • పనులకు ఫండ్స్​ లేని పదవులెందుకు?
  • నిజామాబాద్​ జెడ్పీ మీటింగ్​ను బహిష్కరించిన బీఆర్​ఎస్​ సభ్యులు

నిజామాబాద్, వెలుగు:  మండలాల్లో అభివృద్ధి పనులకు ఎలాంటి ఫండ్స్​ కేటాయించకుండా తమకు పదవులు, ఈ మీటింగులు ఎందుకంటూ నిజామాబాద్​ జెడ్పీ మీటింగ్​ను జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మూకుమ్మడిగా బహిష్కరించారు. ఇందులో ఎక్కువ మంది బీఆర్​ఎస్​ సభ్యులే ఉన్నారు. బుధవారం జిల్లాకు వస్తున్న మంత్రి కేటీఆర్​కు తమ నిరసన తెలియాలన్న ఉద్దేశంతోనే ఇట్ల చేశామని వారు ప్రకటించారు. మండలాలకు ఫండ్స్​ రాక సొంత డబ్బులు ఖర్చు చేసి పనులు చేశామని, ఏడాదిన్నర నుంచి  ప్రభుత్వం నుంచి బిల్స్​ అందక అప్పులపాలయ్యామని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్​ జెడ్పీ సమావేశం మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్​లో ఏర్పాటు చేశారు. అయితే.. జిల్లా కేంద్రానికి వచ్చిన సభ్యులు మాత్రం సమావేశానికి వెళ్లలేదు. ఒక స్టార్​ హోటల్ లో  భేటీ అయ్యి రెండు గంటల పాటు చర్చించుకున్నారు. అక్కడే లంచ్​చేసి వెనుదిరిగారు. ఈ సందర్భంగా సభ్యులు తమ ఆవేదన వెలిబుచ్చారు. మండలాలకు జనాభా ప్రాతిపదికన 15వ ఫైనాన్స్​కమిషన్​ ఫండ్స్ రూ. 5 లక్షల నుంచి  20 లక్షల దాకా వస్తున్నాయని, కానీ స్టేట్​ఫైనాన్స్​ ఫండ్స్ రాక​ ఇబ్బంది పడుతున్నామన్నారు. జెడ్పీ మీటింగ్​కు  జిల్లా మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రావడంలేదని.. ఇక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో  తెలియకే మీటింగ్​కు దూరంగా ఉన్నామని తెలిపారు. ఉదయం 10 గంటలకు జనరల్​బాడీ మీటింగ్​ జరగాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎదురుచూసినా కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు జెడ్పీ చైర్మన్​ విఠల్​రావు ప్రకటించారు.  అయితే.. సమావేశానికి కాంగ్రెస్​కు చెందిన చందూర్​ జెడ్పీటీసీ సభ్యుడు అంబర్​సింగ్, ​ బీజేపీకి చెందిన రెంజల్  జడ్పీటీసీ మెంబర్​ రజినీ కిశోర్, బీ ఆర్ఎస్ కు చెందిన ధర్పల్లి ఎంపీపీ సరిత  మాత్రమే హాజరయ్యారు.  24  మంది జెడ్పీటీసీ సభ్యులు, 26 మంది ఎంపీపీలు సమావేశాన్ని బహిష్కరించారు. 

చైర్మన్​పై  సభ్యుల్లో వ్యతిరేకత   

నిజామాబాద్​ జెడ్పీ చైర్మన్​ పదవిని అప్పట్లో చాలా మంది బీఆర్ఎస్​ లీడర్లు ఆశించారు. చివరికి  మాక్లూర్​ జెడ్పీటీసీ సభ్యుడు విఠల్​రావుకు దక్కింది. ఆయన సీఎం కేసీఆర్​ కుటుంబానికి దగ్గరి వ్యక్తి కావడంతో తమకు ఇష్టం లేకపోయినా బీఆర్ఎస్​సభ్యులు  ఏమీ మాట్లాడలేకపోయారు. జెడ్పీ ద్వారా ఖర్చు చేసే 15 ఫైనాన్స్​, స్టేట్​ ఫైనాన్స్​నిధుల్లో  25 శాతం చైర్మన్​కు, మిగతా 75 శాతం  సభ్యులు పంచుకోవాలని గతంలో విఠల్​రావు తెచ్చిన ప్రతిపాదనపై సభ్యులు గరమయ్యారు. ఈ విషయంలో ఏర్పడిన వివాదం పార్టీ పెద్దల మధ్యవర్తిత్వంతో సద్దుమణిగినా.. చైర్మన్​ తీరుపై చాలా మంది సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు.  

కేటీఆర్​కు నిరసన తెలిపేందుకు ఇదే టైమ్​ అని..!

మంత్రి కేటీఆర్ బుధవారం నిజామాబాద్​ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారులంతా కేటీఆర్ టూర్​ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.  సాయంత్రం బహిరంగ సభ  ఉన్నందున బీఆర్​ఎస్​ లీడర్లు జన సమీకరణ పనుల్లో మునిగిపోయారు. దీంతో మంగళవారం జెడ్పీ మీటింగ్​ జరగకపోవచ్చని భావించారు. తొందరగా మీటింగ్​ ముగించి కేటీఆర్​ టూర్​ ఏర్పాట్లపై దృష్టి పెడదామంటూ సభ్యులకు జెడ్పీ చైర్మన్​ విఠల్​రావు సమాచారం ఇచ్చారు. తమ నిరసన చెప్పడానికి ఇదే సరైన టైమ్​అని భావించిన జెడ్పీటీసీ మెంబర్లు సమావేశాన్ని బహిష్కరించారు.