- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
చేర్యాల, వెలుగు: ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు స్థానిక ఎన్నికల్లో బుద్దిచెప్పాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని రేణుకా గార్డెన్ లో జరిగిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు గెలువాలని అందుకోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి పాలన, కేసీఆర్పాలన మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధును రూ.10,000 నుంచి 12,000 చేస్తామన్నారని, కల్యాణ లక్ష్మి రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి విస్మరించారన్నారు.
ఈ సందర్బంగా నాలుగు మండలాల్లోని గ్రామాల సర్పంచ్అభ్యర్థులను ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు కర్ణాకర్, శ్రీధర్, కృష్ణారెడ్డి, కీర్తన, రాష్ట్ర నాయకులు బాలనర్సయ్య, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
