రాజ్‌‌‌‌భవన్​కు వెళ్లిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ

రాజ్‌‌‌‌భవన్​కు వెళ్లిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ

హైదరాబాద్, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్​భవన్​కు వెళ్లారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా.. గవర్నర్‌‌‌‌‌‌‌‌ కోటాలో ఎమ్మెల్సీలుగా తమను నామినేట్ చేస్తూ గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లో వారు వినతి పత్రాలు అందజేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని పేర్కొన్నారు.

అనంతరం శ్రవణ్, సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అత్యంత పేద కులాలకు చెందిన తమను గత ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో కేబినెట్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌‌‌‌‌‌‌‌కు ప్రతిపాదనలు పంపిందని, ఈ ప్రతిపాదనలను 55 రోజుల తర్వాత గవర్నర్ తిరస్కరించారని శ్రవణ్​ గుర్తు చేశారు. ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయించగా, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు కోర్టు అభిప్రాయపడిందన్నారు. కోర్టు తీర్పుతో తమ ప్రతిపాదనకు ప్రాణం వచ్చిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేసి పేద కులాలకు చెందిన తమకు గవర్నర్ న్యాయం చేయాలని దాసోజు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీలు కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు తమకు ఉన్నాయని ఇరువురు నేతలు పేర్కొన్నారు.