- జపాన్‌లోని రబ్బరు ఫ్యాక్టరీలో ఘటన
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
టోక్యో: జపాన్ లోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో గుర్తుతెలియనివ్యక్తి కత్తితో ఎనిమిది మంది కార్మికులను పొడిచాడు. అంతేకాకుండా ఏడుగురు కార్మికులపై గుర్తుతెలియని లిక్విడ్ చల్లి దాడి చేశాడు. సెంట్రల్ జపాన్ లోని మిషిమ నగరంలో యొకొహమ రబ్బర్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దాడిలో గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. 38 ఏండ్ల దుండగుడు తన ముఖానికి మాస్క్ తొడుక్కుని చేతిలో కత్తితో సాయంత్రం ఆ రబ్బరు ఫ్యాక్టరీలోకి ప్రవేశించాడు.
అక్కడ పనిచేస్తున్న వారిపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దీంతో కార్మికులు భయాందోళనకు గురై ప్రాణరక్షణ కోసం పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తనతో తెచ్చుకున్న ఏదో లిక్విడ్ చల్లి ఏడుగురిని గాయపరిచాడు. ఫ్యాక్టరీలో కార్మికులపై దాడి జరిగిందని పోలీసులకు 4.30 గంటలకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను హాస్పిటల్ కు తరలించారు. దుండగుడిని అరెస్టు చేశారు. కార్మికులపై ఎందుకు దాడి చేశాడన్నది తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
