
సంక్షేమ పథకాల పేరుతో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దళితబంధు, బీసీ బంధు, గిరిజన బంధు పేరుతో పేదలను మోసం చేసిందన్నారు. మోసాలు చేయడంలో, అబద్దాలు మాట్లాడటంలో కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. పాలకుర్తి బీఆర్ఎస్ జడ్పీటీసీ కందుల సంధ్యారాణి సహా..రెండు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సమక్షంలో పార్టీలో చేరారు.
Also Read : హైదరాబాద్కు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
విద్యా , ఉద్యోగాల్లో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని అటకెక్కించారని మండిపడ్డారు. విద్యా, వైద్య రంగానికి బడ్జెట్ లో నిధులు కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిపై బీఆర్ఎస్ మాట్లాడటం లేదని...ఇచ్చిన హామీలు పేపర్లకే పరిమితమయ్యాయని చురకలంటించారు. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అన్ని విషయాల్లో కేసీఆర్ వైఫల్యం చెందారని..కేసీఆర్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 1969లో 300 మందికిపైగా చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. మలిదశ ఉద్యమంలో 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలని..ఈ రెండు పార్టీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేదన్నారు. ఆ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. చేయి గుర్తుకు ఓటేసిన పాపానికి కర్ణాటకలో కాంగ్రెస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చురకలంటించారు. తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని... సకల జనుల తెలంగాణ కోసం బీజేపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.