బీఆర్ఎస్ లీడర్లకు సబ్జెక్ట్ లేదు.. కాంగ్రెస్ లో వర్గపోరు ఉందని పబ్బం గడుపుతున్నారు : వేముల

బీఆర్ఎస్ లీడర్లకు సబ్జెక్ట్ లేదు.. కాంగ్రెస్ లో వర్గపోరు ఉందని పబ్బం గడుపుతున్నారు : వేముల

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో దేశాన్ని ఏకం చేశారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వస్తుందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులకు మాట్లాడడానికి ఎలాంటి సబ్జెక్టు లేకపోవడంతో తమ మధ్య వర్గపోరు ఉందని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. 

6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ ముందుందని వేముల తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ కుల మతాలను  బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి ప్రజలు ఏం చూసి ఓట్లు వేయాలని ప్రశ్నించారు. కులాలతో మతాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టినందుకు ఓట్లు వెయ్యాలా అని నిలదీశారు. బీఆర్ఎస్  మునిగిపోయే పార్టీ అని.. 2014 -18  ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీలు అమలు గురించి చర్చలకు సిద్ధమా ? అని ప్రశ్నించారు.

 జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాలను ప్రజలు గుర్తించారని చెప్పారు. నల్లగొండ,  భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే మెజారిటీ కోసం పోటీ ఉంటుందని చెప్పారు.  కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో జిల్లా అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. త్వరలో భువనగిరి పార్లమెంట్ పరిధిలో చౌటుప్పల్ వేదికగా ప్రియాంక గాంధీ మీటింగ్  ఉంటుందని వేముల వీరేశం తెలిపారు.