దళిత బంధులో బీఆర్ఎస్ లీడర్ల చేతివాటం.. 29 లక్షలు వసూలు

దళిత బంధులో బీఆర్ఎస్ లీడర్ల చేతివాటం..  29 లక్షలు వసూలు

జగిత్యాల, వెలుగు :  దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ లీడర్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ జగిత్యాల జిల్లా ఉమ్మడి మేడిపల్లి మండలంలోని పలువురు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. దేశాయిపేటకు చెందిన ముత్తునూరి గంగారం దళిత బంధు కింద గొర్రెల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గంగారాంతో పాటు మండలంలోని మరో నలుగురికి 15 నెలల క్రితం స్కీం మంజూరైంది. అయితే, కొందరు బీఆర్ఎస్ లీడర్లు వీరితో స్పైసెస్​ యూనిట్ ఏర్పాటు చేయిస్తామని చెప్పి అకౌంట్ల నుంచి రూ.29 లక్షలు డ్రా చేశారు. తర్వాత షెడ్డు మాత్రమే ఏర్పాటు చేయించి సైలెన్స్​అయ్యారు. 

నెలలు గడిచినా యూనిట్ ఏర్పాటు చేయించకపోవడంతో గంగారం వీరిని నిలదీశాడు. దీంతో అతడికి ఓ టూ వీలర్ కొనిచ్చి నోరు మూయించే ప్రయత్నం చేశారు. ఊరుకోని అతడు జిల్లా ఆధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న బీజేపీ సీనియర్ లీడర్, మాజీ జడ్పీ చైర్​పర్సన్​ తుల ఉమ బుధవారం దేశాయిపేటకు వచ్చిన స్పైసెస్​ యూనిట్​షెడ్డు దగ్గర బాధితుడితో మాట్లాడారు. కలెక్టర్ స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బాధితుల పక్షాన నిలబడి పోరాడతామని కాంగ్రెస్ పార్టీ భీమారం మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్​ రెడ్డి అన్నారు.  

గ్రామ పంచాయతీ ఆఫీసు ఎదుట.. 

కొమురవెల్లి :  సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మర్రిముచ్చాలలో దళితబంధు పథకంలో అనర్హులను ఎంపిక చేయాలని చూస్తున్నారని పలువురు మహిళలు గ్రామపంచాయతీ ఆఫీసు ముందు బుధవారం ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ గ్రామంలోని బీఆర్ఎస్ లీడర్లు వారికి నచ్చినవాళ్లనే ఎంపిక చేసేందుకు ప్లాన్​చేస్తున్నారని తెలిసిందన్నారు. అందుకే ఆందోళనకు దిగామన్నారు. ఒకవేళ అదే జరిగితే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై సర్పంచ్ పద్మ మాట్లాడుతూ దళితబంధు కింద అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు.