క్యాడర్ ​చేజారకుండా బీఆర్ఎస్​ చలో గోవా

క్యాడర్ ​చేజారకుండా బీఆర్ఎస్​ చలో గోవా
  • స్థానిక నేతలను ఉత్తేజపరిచేందుకు గులాబీ పార్టీ కొత్త ఎత్తుగడ 
  • ఓటమి తర్వాత పార్టీ లీడర్లు, కార్యకర్తల్లో నైరాశ్యం
  • అందుకే విడతల వారీగా టూర్లు 
  • సిద్దిపేటలో ఆసక్తికర రాజకీయాలు

సిద్దిపేట, వెలుగు:   ఎట్టి పరిస్థితుల్లో నూ మెదక్​ ఎంపీ సీటు గెలవాలని బీఆర్ఎస్​ హైకమాండ్​ పట్టుదలతో ఉన్నప్పటికీ క్యాడర్​లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ స్థానిక  ప్రజాప్రతినిధులు,  ద్వితీయ శ్రేణి నేతల్లో నిస్తేజం అలుముకుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ​నుంచి వలసలు కొనసాగుతున్నట్లే సిద్దిపేటలోనూ అక్కడక్కడా క్యాడర్ ‘కారు’ దిగుతోంది.  పరిస్థితి ఇలాగే ఉంటే మెదక్​ ఎంపీ సీటును సైతం గెలవలేమనే అంచనాకు వచ్చిన బీఆర్ఎస్​ ముఖ్య నేతలు అలర్ట్​ అయ్యారు. కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకోనున్న తరుణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలను సంతృప్తిపరిచే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కిందిస్థాయి నేతలు,  స్థానిక ప్రజాప్రతినిధులను గోవా టూర్లకు పంపుతున్నారు. ఈక్రమంలో సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులు కూడా బ్యాచ్​లవారీగా గోవా వెళ్లి చిల్​ అవుతున్నారు.  

అసంతృప్తుల మనసు మార్చేందుకు...

అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిద్దిపేట మున్సిపల్​ బీఆర్ఎస్ కౌన్సిలర్లలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. చైర్ పర్సన్ భర్త వ్యవహార తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు రహస్య సమావేశాలు నిర్వహించగా, మరి కొందరు పార్టీ మారే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అసంతృప్త కౌన్సిలర్లను మచ్చిక చేసుకోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో వారిని క్రియాశీలకం చేసే దిశగా ప్లాన్లు రూపొందించి ఇటీవల గోవా టూర్లకు తెరలేపారు. సిద్దిపేట మున్సిపాల్టీకి చెందిన 21 మంది కౌన్సిలర్లను రెండు రోజుల క్రితం గోవా తీసుకెళ్లారు. ఇది సక్సెస్​ కావడంతో మండలాలవారీగా టూర్లకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ టూర్ల కోసం ఇప్పటికే మండలాల వారీగా పార్టీ నేతలకు ఇన్​చార్జి బాధ్యతలు కూడా అప్పగించి పై నుంచి మానిటరింగ్​ చేస్తున్నారు. 

అత్యధిక ఓట్లు తెచ్చిన బూత్​ ఇన్ చార్జిలను సైతం.. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు అత్యధిక ఓట్లను సాధించిపెట్టిన పోలింగ్ బూత్ ఇన్‌చార్జీలకు సైతం బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయా మండలాల పరిధిలో బీఆర్ఎస్​కు అత్యధిక ఓట్లు సాధించిన మూడు పోలింగ్ బూత్ ల పరిధిలోని నేతలను నచ్చిన చోటికి తీసుకువెళ్తానని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్​రావు ప్రకటించగా అందరూ గోవా వెళ్లడానికి ఆసక్తి చూపినట్టు సమాచారం. ఇప్పటికే సిద్దిపేట మండలం నుంచి ఓ బ్యాచ్ వెళ్లి రాగా మరో బ్యాచ్ వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  

బీఆర్ఎస్​లో ఎప్పుడూ లేని సంస్కృతి

బీఆర్ఎస్​ పార్టీలో టూర్ల సంస్కృతి అనేది గతంలో ఎప్పుడూ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఎక్కడికక్కడ లీడర్లు కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతుండడంతో ఉన్న క్యాడర్​ను కాపాడుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తున్నది. పార్లమెంట్​ఎన్నికలు కూడా దగ్గర పడడం, ఈసారి మళ్లీ ఓడిపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యే తరుణంలో లీడర్లను మచ్చిక చేసుకుని పార్టీలోనే కొనసాగేలా కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. ఇందులో భాగంగానే టూర్ల కల్చర్లకు తెర లేపింది. 
 
టూర్లతో వలసలు ఆగేనా? 

సిద్దిపేటలో బీఆర్ఎస్ ​క్యాడర్ ​ఫ్రీగా వస్తున్న టూర్ల అవకాశాన్ని ఎందుకు మిస్​ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్య నేత టూర్​కు తీసుకువెళ్లడానికి ఛాన్స్​ ఇచ్చాడు కాబట్టి ముందు అక్కడికి వెళ్లి ఎంజాయ్​ చేసి వద్దామని..తర్వాత ఏం చేయాలన్నది డిసైడ్ ​చేసుకుందామని అనుకుంటున్నట్టు సమాచారం. ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి ఆఫర్లు రాగా టూర్​లో ఎంజాయ్​ చేసి వచ్చిన సదరు లీడర్లు రాగానే పార్టీ మారి బీఆర్ఎస్ హైకమాండ్​కు షాక్​ ఇచ్చారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.