ఎంపీ స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్​ లీడర్లు ఎన్కాముందు!

ఎంపీ స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్​ లీడర్లు ఎన్కాముందు!
  • అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన సీన్​
  • 13 పార్లమెంట్​ సెగ్మెంట్ల పరిధిలోప్రభావం చూపని బీఆర్ఎస్​
  • కాంగ్రెస్​హవా, ఎన్నికల ఖర్చు అభ్యర్థులదే అనడంతో పోటీకి విముఖత

వెలుగు, నెట్​వర్క్ :  వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు వెనుకాడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్​,  సికింద్రాబాద్​, మల్కాజ్​గిరి, మెదక్​ పార్లమెంట్​ సెగ్మెంట్ల పరిధిలో తప్ప ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. మిగిలిన 13 పార్లమెంట్​ నియోజకవర్గాల పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ
సెగ్మెంట్లు కాంగ్రెస్ ​ఖాతాలో పడడం, ఇప్పటికిప్పుడు ఓటర్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం లేకపోవడం, చాలాచోట్ల బీఆర్​ఎస్ ​ఓటమితో  క్యాడర్​ చేజారడం, పార్లమెంట్​ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్​, బీజేపీ నడుమే ఉంటుందనే సంకేతాలతో బీఆర్ఎస్​లోని ముఖ్యనేతలు ఎంపీ స్థానాలపై ఆశలు వదిలేసుకుంటున్నారు. పార్లమెంట్​ ఎన్నికల ఖర్చును అభ్యర్థులే భరించాలని బీఆర్​ఎస్​ హైకమాండ్​ స్పష్టం చేస్తుండడం కూడా లీడర్ల విముఖతకు కారణంగా భావిస్తున్నారు.  

మనసు మార్చుకుంటున్నరు..

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్​3 చోట్ల, కాంగ్రెస్, బీజేపీ చెరో​ రెండు చోట్ల గెలిచాయి.  కానీ, రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్​ చతికిలపడింది. క్యాడర్​ సైలెన్స్​ మోడ్​లోకి వెళ్లిపోగా, మాజీ ఎమ్మెల్యేలు సహా లీడర్లెవరూ బయటకు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ ​నుంచి పోటీచేసేందుకు ఎమ్మెల్సీ కవిత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.  దీంతో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్​ గుప్తాను పోటీకి ఒప్పించేందుకు హైకమాండ్​ ప్రయత్నిస్తున్నా వారు ఇంట్రెస్ట్​ చూపడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇక మొన్నటి  అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ టికెట్ కోల్పోయిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  అసెంబ్లీ ఎన్నికల ముందు భువనగిరి నుంచి పోటీ చేయాలని భావించారు.  కానీ భువనగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేవలం జనగామలో మాత్రమే బీఆర్ఎస్​ గెలవడంతో ఆయన మనసు మార్చుకున్నారు.  అందుకే  గెలుపు అవకాశాలున్న మల్కాజిగిరి గిరి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ముత్తిరెడ్డి అనుచరులు చెప్తున్నారు.  

కొడుకుల భవిష్యత్​పై డైలామాలో సీనియర్లు..

తమ కొడుకులను పార్లమెంట్​ఎన్నికల్లో పోటీ చేయించి రాజకీయంగా వారి భవిష్యత్​కు బాటలు వేద్దామని ఆలోచించిన పలువురు బీఆర్ఎస్​ లీడర్లు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట తప్ప 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్  గెలవడంతో ఎంపీ ఎన్నికల్లో పోటీకి అక్కడి బీఆర్ఎస్​ నేతలు వెనుకాడుతున్నారు. మునుగోడు నుంచి టికెట్​ ఆశించి, భంగపడిన గుత్తా సుఖేందర్​ కొడుకు అమిత్​రెడ్డికి ఎంపీ టికెట్​ ఇస్తామని అప్పట్లో బీఆర్ఎస్​ హైకమాండ్​ హామీ ఇచ్చింది. కానీ, మారిన పరిస్థితుల్లో ఆయన కూడా పోటీకి విముఖత చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నల్గొండ నుంచి బీఆర్ఎస్​ గెలిచే అవకాశం లేనందున, తన కొడుకును బరిలో దింపితే అతని పొలిటికల్​ కెరీర్​కే ప్రమాదమని గుత్తా భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. అదే సమయంలో అమిత్​కు చెక్​ పెట్టేందుకు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పేరును మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు..ఈసారి తాను తప్పుకొని తన కొడుకు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్​ను బరిలో నిలపాలని ఆశించారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లకు ఐదు సెగ్మెంట్లు కాంగ్రెస్​ ఖాతాలో పడడంతో ఇప్పుడు ఆయన ఆలోచనలో పడ్డారు. భరత్​ను బరిలో దింపితే రాజకీయ ఆత్మహత్యే అవుతుందని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, నాగర్​కర్నూల్​ జిల్లా పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజు నుంచి రాములుకు ఇంటిపోరు ఎక్కువైంది. ఇటీవల తెలంగాణ భవన్​లో జరిగిన బీఆర్​ఎస్​ పార్లమెంట్ స్థాయి రివ్యూ మీటింగులో పలువురు ఎమ్మెల్యేలు తమ ఓటమికి రాములు సహకరించకపోవడం కూడా ఒకకారణమని చెప్పడంపై ఎంపీ అలకబూనినట్లు తెలుస్తోంది.

పెద్దపల్లికి ఆమడ దూరం..  

పార్లమెంట్​ స్థానాల్లో పెద్దపల్లి పేరు చెప్తేనే  బీఆర్ఎస్​, బీజేపీ నేతలు జంకుతున్నారు. కారణం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్​పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లనూ కాంగ్రెస్​ గెలుచుకోవడమే! ఈ పార్లమెంట్​ పరిధిలో​ఏకంగా 56శాతం ఓట్లు రాబట్టిన కాంగ్రెస్, ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. బీఆర్ఎస్ 31శాతానికి, బీజేపీ కేవలం 6.5 శాతానికే పరిమితమయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్​ పరిధిలోని  7 సెగ్మెంట్లలో ఆరింటిని గెలుచుకున్న బీఆర్ఎస్ అదే ఊపులో 2019లో ఈ సీటును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అదే ఊపు కాంగ్రెస్​లో కనిపిస్తోందని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోటీకి రెడీ కావాలని ఇటీవల ఈ రెండు పార్టీల హైకమాండ్లు పలువురు నేతలకు సూచించినా ఎవరూ ముందుకు రావడంలేదని తెలుస్తోంది.  బీఆర్ఎస్​ నుంచి సిట్టింగ్​ఎంపీ వెంకటేశ్​ నేతకు మళ్లీ టికెట్​ ఇస్తే గెలిచే అవకాశం లేదని భావిస్తున్న ఆ పార్టీ హైకమాండ్​ కొప్పుల ఈశ్వర్​, సుమన్ లలో ఒకరిని బరిలో దించాలని ప్లాన్​ చేస్తున్నా వారు ఇంట్రెస్ట్​ చూపడం లేదంటున్నారు. ​బీజేపీ నుంచి ఎస్​కుమార్​తప్ప వేరే క్యాండేట్​ లేరు. మందక్రిష్ణను ఇక్కడి నుంచి దింపాలని హైకమాండ్​ఆలోచన చేసినప్పటికీ ఆయన వరంగల్​పై ఇంట్రెస్ట్​ చూపుతున్నారు.