బీసీ భవన నిర్మాణాలకు భూమి పూజ

బీసీ భవన నిర్మాణాలకు భూమి పూజ

కోట్లు విలువ చేసే భూములను బీసీ కులాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోకాపేటలో బీసీ కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు తలసాని భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్‭లు కూడా పాల్గొన్నారు. బీసీ ఆత్మగౌరవ భవనాల కోసం అంతకుముందు ఎన్నో ప్రభుత్వాలను అడిగామని కాని ఒక్కరూ స్పందించలేదని తలసాని చెప్పారు. దేశంలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలు బీసీల కోసం ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‭లో బీసీలకు రూ.6 వేల 2వందల కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. అనంతరం యాదవ్ భవన నిర్మాణాన్ని మంత్రులు, ప్రభుత్వ అధికారులు పరిశీలించారు. 

కుల సంఘాలు ఏకం కావాలి: గంగుల 

రాష్ట్రంలో అన్ని కుల సంఘాలు ఏకం కావాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నూతనంగా నిర్మించనున్న నాలుగు కుల సంఘాల భవనాలకు భూమి పూజ నిర్వహించామని చెప్పారు. మార్చి మొదటి వారంలో అన్ని భవనాల నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. దసరా నాటికి అన్ని కుల సంఘ భవనాల్లో గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన కులాలకు భూములు కేటాయించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 

అన్ని జిల్లాల్లో కుల సంఘాలకు భవన నిర్మాణం: శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ఉద్యమంలో కులవృత్తులు చేసుకునే వారి పాత్ర ఎంతగానో ఉందని.. వాళ్లే ఎక్కువ పోరాటాలు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బీసీ కుల భవన నిర్మాణానికి రూ.4వేల కోట్లు విలువ చేసే భూములను కేటాయించడం జరిగిందన్నారు. అన్ని జిల్లాల్లో కుల సంఘాలకు భవన నిర్మాణాలు జరుగుతున్నాయని.. వాటిని ఆయా జిల్లాల మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని ఆయన చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏ కుల సంఘానికి అయినా ప్రత్యేకించి భవనాలు నిర్మించారా అని శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని ప్రశ్నించారు.