
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సర్కారు బడుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. చిరుద్యోగుల శ్రమ, కష్టాన్ని గౌరవించడం కూడా చేతకావడం లేదా? అని బుధవారం ఆయన ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు బెనిఫిట్స్ కోసం, స్కావెంజర్ల వంటి చిరు ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకం నిధులు కూడా ఏడాదిగా పెండింగ్‌లో పెట్టారన్నారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నిలిపేశారని, మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించకుండా గాలికి వదిలేశారని విమర్శించారు.
విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌కు.. ఆయన సొంత శాఖలోని ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతన సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి, ఆచరణలో మాత్రం గాలికి వదిలేశారన్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలందించిన విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులైన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని మానసికంగా వేధించడం అమానవీయం, అనైతికమని విమర్శించారు.