- ప్లాన్ ప్రకారం ఫోరెన్సిక్ ల్యాబ్ లో సాక్ష్యాలు దగ్ధం: హరీశ్ రావు
మెదక్/రామాయంపేట/నర్సాపూర్ , వెలుగు: పట్టపగలు రూ.50 లక్షలతో ఎమ్మెల్యేను కొంటూ పట్టుబడిన దొంగ రేవంత్ రెడ్డి అని.. ఓటుకు నోటు కేసులో ఆయన జైలు కు వెళ్లే టైం వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అందుకోసమే రోజు కేసీఆర్ మీద నోరు పారేసుకుంటున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్, రామాయంపేట, నర్సాపూర్ పట్టణాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు.
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన సాక్ష్యాలు దొరకకుండా చేసేందుకు ప్లాన్ ప్రకారం ఫోరెన్సిక్ ల్యాబ్ మంటలు అంటుపెట్టించారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని దద్దమ్మ ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు.
పెన్షన్ నాలుగు వేలకు పెంచలేదని, మహిళలకు ఇస్తామన్న నెలకు 2,500 ఇయ్యలేదని, ఒక్క ఫ్రీ బస్సు తప్ప అన్నీ తుస్ అయ్యాయని.. ఇది మహిళలను, నిరుద్యోగులను, విద్యార్థులను, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన ధోకా సర్కార్ అని విమర్శించారు. మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో చురుకు పెట్టాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ పార్టీ, బీజే పీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రాత్రుల్లో బీజేపీ నాయకులను కలుస్తున్నారని అన్నారు. మెదక్ ఎమ్మెల్యే మల్కాజ్ గిరి నుంచి గూండాలను తెచ్చి గుండాయిజం చేస్తున్నారని ఆరోపించారు.
