కేసీఆర్ శత్రువుల మాటలే కవిత మాట్లాడ్తున్నది: జగదీశ్ రెడ్డి

కేసీఆర్ శత్రువుల మాటలే  కవిత మాట్లాడ్తున్నది: జగదీశ్ రెడ్డి
  • ఆమెకు నా సానుభూతి: జగదీశ్‌రెడ్డి
  • నేను చావు తప్పి కన్నులొట్టపోయి గెలిస్తే.. కొందరు అసలు గెలవలేదు కదా?
  • లేఖ లీక్​ అవ్వడానికి బాధ్యులెవరో కవితకే తెలియాలి
  • అసలు ఆమెకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే అడగాలని కామెంట్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌‌‌‌కు బద్ధ శత్రువులు, బీఆర్‌‌‌‌ఎస్‌‌ను ఖతం చేయాలని చూస్తున్న రేవంత్‌‌రెడ్డి, వేమూరి రాధాకృష్ణ మాటలనే.. కల్వకుంట్ల కవిత వల్లెవేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్‌‌రెడ్డి అన్నారు.  అందుకు ఆమెకు సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. ఓ లిల్లీపుట్​ నాయకుడి వల్లే నల్గొండలో బీఆర్ఎస్​ సర్వనాశనం అయిందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆదివారం జగదీశ్‌‌రెడ్డి  మీడియా ఎదుట స్పందించారు.  తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని ఎద్దేవా చేశారు. తాను చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచానంటున్నారని, కానీ, కొందరు అసలు గెలవలేదు కదా? అని కవితనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘కవిత తన తండ్రికి రాసిన లేఖ ఎలా లీకైందో.. దానికి బాధ్యులెవరో ఆమెకే తెలియాలి. అసలు కవితకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో తెలుసుకుంటే మంచిది” అని వ్యాఖ్యానించారు.  

కవిత గురించి చర్చ వృథా 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 25 ఏండ్లలో జరిగిన ఉద్యమాలు, గెలుపుకు తాను కారణమైతే.. పార్టీ ఓటమికీ తనదే బాధ్యత అని జగదీశ్‌‌రెడ్డి అన్నారు. వ్యక్తులుగా ఏదో చేస్తామని కొందరు ఊహించుకుంటున్నారని, అది వారి భ్రమే అవుతుందన్నారు. తాను ఇటీవలి కాలంలో కేసీఆర్‌‌‌‌ను 50 సార్లు కలిశానని చెప్పారు. కానీ, ఏనాడూ కవిత గురించి చర్చ రాలేదని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కవితకు సంబంధించిన ప్రశ్న అడిగితే.. ఆమె గురించి కేసీఆర్​, కేటీఆర్‌‌‌‌ వద్ద చర్చే జరగలేదని, దాని మీద మాట్లాడడం సమయం వృథా అని చెప్పానని తెలిపారు. కేసీఆర్‌‌‌‌తో బనకచర్ల, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైనే మాట్లాడానన్నారు.  కేసీఆర్​ లేకపోతే ఎవరూ లేరన్నారు. కవితపై తీన్మార్​ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని, తాను చూసి ఉంటే స్పందించేవాడినని  తెలిపారు.