మా మీద కోపాన్ని ఓట్లలో చూపిన్రు : జగదీశ్ రెడ్డి

మా మీద కోపాన్ని ఓట్లలో చూపిన్రు : జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : తమపై ఉన్న కోపాన్ని ప్రజలు ఓట్ల రూపంలో చూపారని బీఆర్ఎస్  ఎమ్మెల్యే జగదీశ్  రెడ్డి అన్నారు. ఐదేండ్ల తరువాత మళ్లీ గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన చిట్ చాట్  చేశారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్  ఎంత లేట్ గా వస్తే అంత తమకే మంచిదన్నారు. రైతుబంధు, రుణ మాఫీ, గృహజ్యోతి అమలుపై అధికార పార్టీని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.  

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టాల పర్యటనలకు వెళుతున్నారని, ఆయన పర్యటనల తరువాతే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్  వస్తుందని చెప్పారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు లోక్ సభ సీట్లు గెలుస్తామన్నారు. ఈనెల 13న నల్గొండ లో కేసీఆర్  మీటింగ్ కు పోలీసులు అనుమతి ఇచ్చారని తెలిపారు.

20 ఏండ్ల కిందటి కేసులు తీస్తున్నరు

కరీంనగర్ లో బీఆర్ఎస్ లీడర్  అంటేనే అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్యే గంగుల కమాలకర్  అన్నారు. 20 ఏళ్ల కిందటి కేసులు ఇపుడు బయటకు తీస్తున్నారని తెలిపారు. మధ్యవర్తిగా ఉండి పంచాయతీ పరిష్కారం చేసినా అరెస్టు చేస్తున్నారని మీడియా చిట్ చాట్ లో ఆయన చెప్పారు. ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కంచెలు తీశామని చెప్పి మళ్లీ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి హరీశ్  రావు మీడియాతో వ్యాఖ్యానించారు.