యుద్ధ వాతావరణంలో అందాల పోటీలా? : బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​ 

యుద్ధ వాతావరణంలో అందాల పోటీలా? : బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​ 

హైదరాబాద్, వెలుగు: అందాల పోటీలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలిగానీ.. యుద్ధవాతావరణంలో కాదని బీఆర్ఎస్​ పార్టీ అసెంబ్లీ విప్​, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​ అన్నారు. అందాల పోటీలకు మూడంచెల భద్రత కల్పిస్తామని ప్రభుత్వం షెడ్యూల్​ ప్రకటించిందని, ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలు నిర్వహించడం మంచిది కాదని తెలిపారు. శనివారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. రేవంత్​ పాలనలో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని చెప్పారు.

‘ఆపరేషన్​ సిందూర్’​ నేపథ్యంలో కగార్​నూ నిలిపేశారని, ఆ ఆపరేషన్​లో పాల్గొంటున్న బలగాలనూ కేంద్రం వెనక్కు పిలిచిందని పేర్కొన్నారు. సైన్యానికి సంఘీభావంగా దేశమంతా ర్యాలీలు జరుగుతుంటే.. సీఎం అందాల పోటీల క్యాట్​వాక్​ పోటీల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. అందాల పోటీలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని ఓ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. రాష్ట్ర పరువును సీఎం దిగజారుస్తున్నారని విమర్శించారు. పాలన అంటే చిన్న పిల్లల ఆటనా అని, అభినవ నీరోలా రేవంత్​ రెడ్డి వ్యవహరిస్తున్నారని వివరించారు.