
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. Ed విచారణకు హాజరయ్యే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ తో మీటింగ్ అనంతరం ఈడీ విచారణకు హాజరుకావడంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫాం హౌస్ కేసుకు సంబంధించి రెండుమార్లు విచారించిన ఈడీ అధికారులు 27వ తేదీన మరోసారి హాజరు కావాలని సూచించారు.
ఈ రోజు విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు ప్రచారం జరిగింది. అయితే... విచారణకు హాజరయ్యే విషయంలో ఈడీకి తాను ఎలాంటి మెయిల్ పంపలేదని ఆయన స్పష్టం చేశారు. ఈడీ ఇన్వాల్వ్ కావడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, రేపు అది బెంచ్ పైకి వస్తుందని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తానని అన్నారు. ఈడీ విచారణకు వెళ్లడంపై న్యాయవాదులతో చర్చించి వారు చెప్పినట్లు చేస్తానని అన్నారు.