బీఆర్ఎస్ లో అసమ్మతి వీడి ఐక్యతారాగం

బీఆర్ఎస్ లో అసమ్మతి వీడి ఐక్యతారాగం

మహబూబాబాద్, వెలుగు: నిన్న మొన్నటి దాక కొట్లాడుకున్న నేతలు ఇప్పుడు కలిసిపోవడం మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ క్యాడర్​ను ఆశ్చర్యపరుస్తున్నది. జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ సీట్లకు సిట్టింగ్ లనే అభ్యర్థులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్యేలు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. దీంతో హైకమాండ్ జోక్యం చేసుకుని ఎన్నికల్లో కలిసి పని చేయాలని ఆదేశించడంతో ఎమ్మెల్యేలు తమ ప్రత్యర్థుల ఇండ్లకు వెళ్లి  సహకారం కోరడం.. వారు కూడా సానుకూలంగా స్పందించడం చర్చనీయాంశమైంది. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్​కు.. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ, మంత్రి సత్యవతి రాథోడ్​తో విభేదాలున్నాయి. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తే డోర్నకల్​ నుంచే బరిలోకి దిగుతానని సత్యవతి ప్రకటించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్​కు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు మధ్య కూడా తీవ్ర విభేదాలున్నాయి. శంకర్​నాయక్, కవిత బహిరంగంగా గొడవ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

విభేదాలకు తెరపడినట్లేనా?

విభేదాలు మరిచి ఎమ్మెల్యేలు లీడర్లను కలుపుకుపోవాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో రెడ్యానాయక్ హైదరాబాద్​లో మంత్రి సత్యవతి ఇంటికి వెళ్లారు. ఆమెను సత్కరించి మద్దతు కోరారు. శంకర్​నాయక్​ మాలోతు కవిత ఇంటికి వెళ్లి సపోర్ట్​ చేయాలని కోరారు. ఇంటికి వచ్చిన శంకర్​నాయక్​ను కవిత సన్మానించారు. ఇన్నాళ్లు వ్యతిరేకించిన ఎమ్మెల్సీ టి.రవీందర్​రావు తోనూ సఖ్యతకు ప్రయత్నాలు చేస్తున్నారు. లీడర్లు కలిసిపోయినట్లు కనిపిస్తున్నా మొదటి నుంచి గొడవలు పడ్డ అనుచరులు ఎంతవరకు కలుస్తారనే వేచి చూడాలి.