
- ప్రచారం, ఇతర కార్యకలాపాలపై ఆరా
- పార్టీపై ప్రతికూల ప్రభావం చూపకుండా కేసీఆర్ జాగ్రత్తలు
- రంగంలోకి నార్త్ ఇండియా ఏజెన్సీలు, లోకల్ టీమ్స్, ఇంటెలిజెన్స్
- ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న అభ్యర్థులతో జాబితా
- ఆయా నియోజకవర్గాల్లో ఏంచేయాలనే దానిపై మల్లగుల్లాలు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రగతి భవన్ నిఘా వెంటాడుతున్నది. ప్రతి అభ్యర్థి కదలికలపై సర్వైలెన్స్ కొనసాగుతున్నది. ఎమ్మెల్యేలు, అభ్యర్థుల ప్రచారం, వారి కార్యకలాపాలపైనా నిత్యం ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల వ్యవహార శైలి తమ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపకుండా కేసీఆర్ ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందుకోసం నార్త్ ఇండియాకు చెందిన సర్వే ఏజెన్సీలతోపాటు లోకల్టీమ్స్, స్టేట్ ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దింపారు. పదికి పైగా సర్వే సంస్థలు రోజూ సర్వే చేస్తూ ప్రగతి భవన్‌కు రిపోర్టులు ఇస్తున్నాయి. ఎంఐఎం ప్రాబల్యమున్న ఓల్డ్‌సిటీ సహా ప్రతి నియోజకవర్గంలో అభిప్రాయాలను సేకరిస్తున్నారు. క్యాండిడేట్లుగా ప్రకటించినా పనితీరు బాగుంటేనే బీఫామ్ఇస్తామని, లేకుంటే అభ్యర్థులను మార్చేస్తామని కేసీఆర్ ఇప్పటికే తేల్చిచెప్పేశారు. దీంతో బీఫామ్ టెన్షన్‌తో ఉన్న ఎమ్మెల్యేలు, అభ్యర్థులు.. తమపై హైకమాండ్ పెట్టిన నిఘాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
సర్వేలతో కేసీఆర్‌లో కలవరం
రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌పై ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత కనిపిస్తున్నది. కర్నాటక ఎన్నికల ఫలితాలిచ్చిన జోష్‌తో కాంగ్రెస్‌పార్టీ పని చేస్తున్నది. ఎలాగైనా తెలంగాణలో గెలవాలని సర్వ శక్తులు ఒడ్డుతున్నది. మరోవైపు కేసీఆర్ హ్యాట్రిక్ఆశలకు జమిలి ఎన్నికలతో చెక్‌పెట్టాలనే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. కేంద్రంతో పాటే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ప్రధాని మోదీ మేనియాతో ఇక్కడా సత్తా చాటాలని కమలం పార్టీ లెక్కలు వేసుకుంటున్నది. మునుగోడు ఎన్నికల్లో తమ మద్దతు తీసుకుని, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి హ్యాండ్ఇచ్చిన కేసీఆర్‌ను దెబ్బకొట్టాలనే పట్టుదలతో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌తో జట్టుకడితే గులాబీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావచ్చని సర్వేల రిపోర్టులు చెప్తున్నాయి. ఈ రిపోర్టులే కేసీఆర్‌ను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారవిడుచుకునేందుకు సిద్ధంగా లేరు. ఈక్రమంలోనే ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై నిఘా పెట్టారు. ఏకంగా పది టీములను రంగంలోకి దించారు. ఇందులో ఐదారు సర్వే బృందాలు నార్త్ఇండియాకు చెందినవి అని తెలుస్తున్నది. మిగతా టీములు తెలంగాణ, ఏపీ కేంద్రంగా పని చేస్తున్నవేనని గులాబీ ముఖ్య నేతలు చెప్తున్నారు. వీటికి తోడు స్టేట్ఇంటెలిజెన్స్నిత్యం ఎలక్షన్టాస్క్ లోనే పని చేస్తున్నది.
30 మందిపై తీవ్ర వ్యతిరేకత
ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల్లో 30 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా ఆయా సర్వే సంస్థల రిపోర్టులు, ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఇందులో దాదాపు సగం మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లేనని సమాచారం. ముగ్గురు, నలుగురు మంత్రులు, ఇంకో పది మంది వరకు కీలక నేతలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టుగా నేతలు చెబుతున్నారు. కొందరి వ్యవహార శైలి పార్టీకి చేటు చేస్తుందని కేసీఆర్‌కు నివేదికలు అందినట్లు తెలుస్తున్నది. ఆయా నియోజకవర్గాల్లో సీఎంగా ప్రజలు కేసీఆర్‌వైపే మొగ్గు చూపుతున్నా.. అక్కడ పార్టీ క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ మాత్రం రివర్స్‌లో ఉన్నట్టుగా సర్వేల్లో గుర్తించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని ఎలా చక్కదిద్దాలి? ఏం చేస్తే విజయం సాధ్యమవుతుందనే లెక్కల్లో ప్రగతి భవన్ ముఖ్యులు నిమగ్నమయ్యారు. సర్వే ఏజెన్సీల నివేదికలు, రోజువారి ఇంటెలిజెన్స్ రిపోర్టులను స్టడీ చేసి ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న అభ్యర్థుల జాబితా రూపొందించారు.
ఇటీవల ఇచ్చిన మూడు రిపోర్టుల్లోనూ ఈ 30 మందిలో 25 మందికి పైగా అభ్యర్థులు పేర్లు రిపీటెడ్‌గా ఉన్నాయని తెలుస్తున్నది. ఆయా నియోజక వర్గాల్లో క్యాండిడేట్లను మార్చేసి ఆల్టర్నేట్ చూసుకోవడమా? ఉన్న వాళ్లకే క్లాస్ పీకి అందరితో కలిసి పని చేసేలా నచ్చజెప్పడమా? అనే దానిపై బీఆర్ఎస్ హైకమాండ్ డైలమాలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఒక జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యేను ప్రగతి భవన్‌కు పిలిపించి అందరినీ కలుపుకొని పని చేయకుంటే మార్పు తప్పదని హెచ్చరించినట్టుగా సమాచారం. అలాగే ఇంకొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇలాంటి వార్నింగే ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అప్పుడు ఇష్టారాజ్యం.. ఇప్పుడు హైరానా
ఎమ్మెల్యేలు, అభ్యర్థుల ప్రజాజీవితంతో పాటు ప్రైవేట్వ్యవహారాలపైనా సర్వే ఏజెన్సీలు ఫోకస్పెట్టడం గులాబీ లీడర్లలో టెన్షన్ పుట్టిస్తున్నది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఫైనల్అని.. ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా ఇతర లీడర్లెవరూ జోక్యం చేసుకోవద్దని హైకమాండ్ఆదేశించడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు హైరానా పడుతున్నారు. సర్వే నివేదికల్లో ఏముందో తెలుసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మొన్నటిదాకా సొంత నియోజకవర్గానికి చెందిన ఇతర ప్రజాప్రతినిధులను ఏమాత్రం పట్టించుకోని ఎమ్మెల్యేలు.. ఇప్పుడు వాళ్లతో రాజీకి ప్రయత్నిస్తున్నారు.
తమకు సపోర్ట్చేయాలని, గతంలో జరిగిన తప్పులు రిపీట్కావని ఆయా లీడర్ల ఇండ్లకు వెళ్లి కోరుతున్నారు. మంత్రి కేటీఆర్ అందుబాటులో లేకపోవడం, తమ నియోజకవర్గంలో టికెట్రాని లీడర్లు బల ప్రదర్శనకు దిగుతుండటంతో ఈ వ్యవహారాలన్నీ ఎక్కడ తమ పుట్టి ముంచుతాయోననే ఆందోళనలో ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ఉన్నారు. ముందే క్యాండిడేట్‌గా ప్రకటించినా నియోజకవర్గంలో స్వేచ్ఛగా పని చేసుకునే అవకాశమే లేదని, బీఫామ్వస్తుందో లేదోనని, చివరికి కొత్త వాళ్లను తెచ్చి ముందు పెడుతారేమోననే బుగులు పడుతున్నారు.