
కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు పిటిషన్ ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్య బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. వాళ్లతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరనున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని, కారణాలు ఏవైనా బీఆర్ఎస్ ను ఇంకా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.
కాగా, ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేశ్, పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరగా.. బీబీ పాటిల్, పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగి, కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు.