Delhi Liquor Scam : కాసేపట్లో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam : కాసేపట్లో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత

లిక్కర్ స్కామ్ లో ప్రశ్నించనున్న ఈడీ  

సిసోడియా, పిళ్లైతో కలిపి విచారించే చాన్స్ 

ఢిల్లీకి చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు

లిక్కర్ స్కామ్​లో సిసోడియా, పిళ్లైతో కలిపి విచారించే చాన్స్ 

ఢిల్లీకి చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు 

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఆమె చేరుకోనున్నారు. 11 గంటలకు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో హైదరాబాద్​కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై, బ్రిండ్‌‌‌‌కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ సింగ్ ధాల్, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్​మెంట్ల ఆధారంగా కవితకు ఈడీ ఈ నెల 8న నోటీసులు ఇచ్చింది. 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు 15 వరకు టైమ్ ఇవ్వాలని కవిత కోరగా, ఈడీ నుంచి రిప్లై రాలేదు. దీంతో 11న వస్తానని రిక్వెస్ట్ పంపి, బుధవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి వచ్చారు. ఇందుకు ఈడీ అధికారులు అంగీకరించడంతో మార్చి 11న కవిత విచారణకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగే చాన్స్​ ఉండడంతో ఈడీ ఆఫీసుకు వెళ్లే రూట్​లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఈడీ ఆఫీసు చుట్టుపక్కల 144 సెక్షన్  విధించారు. 

ఢిల్లీలోనే కేటీఆర్, హరీష్ రావు

కవితను ఈడీ విచారించనున్నందున మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు శుక్రవారం (మార్చి 10న) రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ​విస్తృత స్థాయి సమావేశం ముగిశాక కేటీఆర్ మరో ఇద్దరు ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత హరీశ్​రావు కూడా వెళ్లారు. సీఎం కేసీఆర్ ​ఆదేశాల మేరకే వారు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. కవిత అరెస్టు తప్పదనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

లీగల్ టీమ్​తో కవిత భేటీ

మరోవైపు..లీగల్ టీమ్ కూడా ఢిల్లీకి చేరుకుంది. మహిళా రిజర్వేషన్లపై దీక్ష ముగిసిన తర్వాత ఆ టీమ్​తో కవిత భేటీ అయి, ఆమెకు న్యాయ సలహాలు ఇచ్చినట్టు సమాచారం. బలవంతంగా తన వాంగ్మూలాన్ని తీసుకున్నారన్న అరుణ్ పిళ్లై పిటిషన్​పై కూడా చర్చించినట్లు తెలిసింది. ఈడీ విచారణకు హాజరయ్యే ముందు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నారు. 

ఢిల్లీలోనే మహిళా కార్యకర్తలు

మహిళా రిజర్వేషన్ల కోసం శుక్రవారం కవిత చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్ఎస్, భారత్ జాగృతి కార్యకర్తలు ఢిల్లీలోనే ఉండిపోయారు. వీరిలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు. దీక్ష తర్వాత చాలామంది తిరిగి వెళ్లిపోవాల్సి ఉన్నా..  కవిత విచారణ నేపథ్యంలో వీరంతా ఆగిపోయారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

ఆ స్టేట్​మెంట్లే కీలకం.. 

సౌత్ గ్రూప్​లో కవిత కోసమే పని చేశామని అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన స్టేట్​మెంట్లే కవిత విచారణలో కీలకం కానున్నాయి. ఫోన్ల ధ్వంసం, ఢిల్లీ, హైదరాబాద్ లో మీటింగ్స్, ఆప్ కు హవాలా రూపంలో డబ్బు తరలింపు వంటి అంశాలపై ఈడీ ఫోకస్ పెట్టనున్నట్టు తెలిసింది. కవితను ముందు విడిగా, ఆ తర్వాత జాయింట్ సెషన్ లో విచారిస్తారని సమాచారం. కవిత అనుచరుడు పిళ్లై ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు. అలాగే తీహార్ జైలులో ఉన్న మనీశ్ సిసోడియాను 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు శుక్రవారం ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో కవిత విచారణలో మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై కూడా ఉంటారని చర్చ జరుగుతోంది. ఈ విచారణ ఒక్క రోజుతోనే ముగిసే పరిస్థితి లేదని, ఆదివారం కూడా కవితను పిలిచే ఆవకాశం ఉందని తెలిసింది.