
- బీజేపీలో పార్టీ విలీనానికి ప్రయత్నాలు జరిగాయని రెండు నెలల కిందనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు
- తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కామెంట్లు
- బీజేపీలో కలుస్తామని కేటీఆర్ అడిగారని వెల్లడి
- దీంతో కవిత వ్యాఖ్యలకు మరింత బలం
- సీఎం రమేశ్ కామెంట్లతో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలో కలకలం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ సీఎం రమేశ్చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్ నిజంగానే ప్రయ త్నించారా? అని ఆ పార్టీ సీనియర్లీడర్లు కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రెండు నెలల కిందనే కేసీఆర్ బిడ్డ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇదే విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేసేందుకు 101 శాతం ప్రయత్నించారంటూ బాంబుపేల్చారు. మేలో అమెరికా టూర్‌కు వెళ్లిన ఆమె.. అక్కడి నుంచి వచ్చీరాగానే ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’అంటూ వ్యాఖ్యానించారు.
కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించే కవిత ఈ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో పార్టీలో జోరుగా చర్చ జరిగింది. మళ్లీ ఆ తర్వాత రెండుమూడు రోజులకే మే 29న కవిత తన ఇంట్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘నన్ను జైలు నుంచి విడిపించే సాకుతో బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్రలు పన్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేయవద్దని నా తండ్రికి తేల్చి చెప్పాను. అవసరమైతే ఇంకొన్నాళ్లు జైలులోనైనా ఉంటాను గానీ.. బీజేపీలో విలీనాన్ని ఒప్పుకోబోనని స్పష్టం చేశాను. నా తండ్రి స్ట్రాంగ్‌గానే ఉన్నా.. కొందరు కావాలనే బీజేపీలో విలీనం చేసేందుకు డ్రైవ్చేస్తున్నారు”అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి కవిత పరోక్షంగా కామెంట్ చేశారు.
బీజేపీలోనూ కలకలం..
బీఆర్ఎస్ విలీనంపై సొంత పార్టీ ఎంపీనే సంచలన కామెంట్స్చేయడంతో బీజేపీలోనూ కలకలం రేగింది. కొందరు పెద్దల నిర్ణయాలతో పార్టీకి నష్టం జరుగుతున్నదని ఇప్పటికే కొంతమంది సీనియర్లీడర్లు కామెంట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ఎప్పటికప్పుడు పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పెద్ద ప్యాకేజీ ఇస్తే బీజేపీ నేతలూ బీఆర్ఎస్‌తో కలిసిపోయేందుకు సిద్ధంగానే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్లీడర్లు చెప్పినట్టే పార్టీలో కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఆయన కూడా బాంబు పేల్చారు. ఇటీవల ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు. ఇప్పుడు సీఎం రమేశ్వ్యాఖ్యలతో కొందరు సీనియర్ లీడర్లు కూడా అంతర్మథనంలో పడినట్టు తెలుస్తున్నది.
పార్టీ కేడర్ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని వాళ్లంతా తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్‌ను మార్చడంతో పార్టీ కేడర్ నుంచే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేల్చిన బాంబుతో పాటు.. సొంత పార్టీ ఎంపీనే విలీనంపై మాట్లాడడంతో మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని పలువురు లీడర్లు సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలకు రెండు అస్త్రాలు దొరికినట్టయింది. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేశాయని కాంగ్రెస్లీడర్లు ఎప్పటికప్పుడు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
సీఎం రమేశ్ వ్యాఖ్యలతో బలం
కవిత చేసినట్టుగానే సీఎం రమేశ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘కేటీఆర్ ఢిల్లీలోని నా ఇంటికి వచ్చి.. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలుపుతామని చెప్పారు. బీజేపీ పెద్దలతో మాట్లాడాలని కాళ్లావేళ్లా పడ్డారు. ఇందుకు నా దగ్గర రుజువులు కూడా ఉన్నాయి”అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న వ్యాఖ్యలకు మరింత బలం చేకూరినట్టయింది. అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేకానేక ఆరోపణలు రావడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో బీఆర్ఎస్‌పై పిడుగు పడినట్టయింది. దానికితోడు ఫోన్ ట్యాపింగ్అంశం దుమారం రేపింది.
ఇటు లిక్కర్ స్కామ్‌లో ఎంపీ ఎన్నికలకు ముందు కవిత జైలుకు పోయారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బతగిలింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జారిపడి తుంటి ఎముక విరగడంతో ఎర్రవల్లికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు తీవ్రంగానే జరిగాయన్న వార్తలొచ్చాయి. 2 నెలల క్రితం కవిత, ఇప్పుడు సీఎం రమేశ్ అవే వ్యాఖ్యలు చేయడంతో పార్టీలోని సీనియర్లు అంతర్మథనంలో పడిపోయారన్న చర్చ జరుగుతున్నది.